75 ఏళ్ల క్రితం నేరం.. ఇప్పుడు ఏం చేశాడంటే!

25 Jun, 2018 09:52 IST|Sakshi

తప్పు చేశామని తెలిసినా కూడా దాన్ని ఒప్పుకోవడానికి మనలో చాలా మంది ఇష్టపడరు. కానీ టెక్సాస్‌కు చెందిన ఓ వృద్ధుడు మాత్రం 75ఏళ్ల కిందట తాను చేసిన ఓ దొంగతనానికి 90 ఏళ్ల వయసులో క్షమాపణలు కోరాడు. ఈ ఘటన యూఎస్‌ఏలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.

90ఏళ్ల పెద్దాయన 75 ఏళ్ల కింద ట్రాఫిక్ సిగ్నల్‌గా ఉపయోగించే స్టాప్ సైన్ బోర్డ్‌ను ఎత్తుకెళ్లారట. మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలీదు కానీ తను చేసిన తప్పును సరిదిద్దుకుందామనుకున్నారు. లేటైనా సరే లేటెస్ట్‌గా తన తప్పును ఒప్పుకున్నారు. అంతే కాదు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 50 డాలర్ల నోటును కూడా పెట్టి, క్షమాపణలంటూ లెటర్ రాసి.. ఉటాహ్ సిటీలో ఉన్న మిడ్‌వాలె పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు పోస్ట్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఈ లెటర్‌ను తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో, ఆ లెటర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిపార్ట్‌మెంట్‌ షేర్‌ చేసిన మెసేజ్...

ఆ వ్యక్తి గొప్పతనానికి మురిసిపోయిన డిపార్ట్‌మెంట్ అధికారులు.. అతడిని పర్సనల్‌గా కలుద్దామనుకున్నారు. కానీ అతడు పంపించిన లెటర్‌లో ఆ వ్యక్తికి సంబంధించిన ఏ సమాచారం లేకపోవడంతో అడ్రస్ కనుక్కోలేకపోయారు. ‘లెటర్‌ పంపించిన వ్యక్తి తనను తాను క్షమించుకొని మిగతా జీవితం ప్రశాంతంగా గడిపితే చాలు’ అని డిపార్ట్‌మెంట్ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు