ఇద్దరు తప్ప అందరూ..

24 May, 2020 05:04 IST|Sakshi

కరాచీ విమాన ప్రమాదంలో 97 మంది కన్నుమూత

కరాచీ: పాకిస్తాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లాహోర్‌ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం శుక్రవారం కరాచీ విమానాశ్రయం దగ్గర్లోని ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలింది. శనివారం ఉదయానికి ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి సంఖ్య బయటకు వచ్చింది. విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పాకిస్తాన్‌ ఆర్మీ తెలిపింది.

ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో 51 మంది పురుషులు, 31 మంది మహిళలు, 9 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రులకు తరలించారు. 19 మృతదేహాలు ఎవరివనేది గుర్తించినట్లు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో 25 ఇళ్లు ధ్వంసం కాగా, 11 మంది నివాసితులు గాయపడ్డారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్‌ ఎయిర్‌ లైన్స్‌ అసోíసియేషన్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై పాక్‌ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. సాంకేతిక సమస్యల వల్ల విమానం కూలి ఉండవచ్చని, దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు