మహమ్మారిని తరిమేసి చిందేశారు

26 Nov, 2015 15:37 IST|Sakshi
మహమ్మారిని తరిమేసి చిందేశారు

సియెర్రా లియోన్: ఎబోలా వైరస్ గుర్తుండే ఉందిగా.. ఆ పేరు వింటేనే ప్రాణాలు హరీ అనేంత పరిస్థితి. ఆ వైరస్ ఎప్పుడో ఉన్నా సరిగ్గా ఏడాదిన్నర కిందట పశ్చిమాఫ్రికాలోని సియెర్రా దేశంలో అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టిందో లేదో వెంటనే వరుస మరణాలు. మొత్తం ఆ దేశాన్ని గజగజలాడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడి పరిస్థితులపట్ల ఎంతో ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి మహ్మమ్మారిపై అక్కడి వైద్యులు, ఇతర సిబ్బందితోపాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా దానికి తోడై సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఆ దేశం ఊపిరిపీల్చుకుంది. ఎబోలాపై సమరశంఖం పూరించి చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సియెర్రా దేశం శబాష్ అనిపించుకుంది.

గత 42 రోజులుగా ఒక్క ఎబోలా కేసు కూడా నమోదుకాకపోవడంతో ఎబోలా రహిత తొలి దేశంగా సియెర్రా లియోన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మే 2014 నుంచి మొత్తం 8,704 ఎబోలా కేసులు నమోదుకాగా 3,589మంది ప్రాణాలుకోల్పోయారు. చివరికి గత 42 రోజులుగా ఒక్క మరణం చోటుచేసుకోకపోవడంతోపాటు ఒక్క ఎబోలా కేసుకూడా నమోదుకాలేదు. ఎబోలా రహిత దేశంగా తమను ప్రకటించడంతో అక్కడి డాక్టర్లు, ఇంజినీర్లు, వైద్య సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర సామాన్య జనం 'బైబై ఎబోలా' అంటూ ఓ మ్యూజిక్ తో వీడియోను సరదాగా పోస్ట్ చేశారు. తాము ఎబోలాపై విజయం సాధించామని ఆనందంతో ఆ వీడియోలో చిందులు వేస్తూ కనిపించారు.

మరిన్ని వార్తలు