రెండో రెఫరెండం వైపే బ్రిటన్ల చూపు

27 Jun, 2016 22:14 IST|Sakshi
రెండో రెఫరెండం వైపే బ్రిటన్ల చూపు

యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలన్న షాకింగ్ తీర్పుతో బిత్తరపోయిన ఆ దేశ వాసుల్లో, మరోసారి రెఫరెండం నిర్వహించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. బ్రిటన్‌లో మళ్లీ రెఫరెండం నిర్వహించాలన్న ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతుగా ఏకంగా ముప్పై లక్షలకుపైగా మంది సంతకాలు చేశారు.

అధికారిక పార్లమెంటరీ పిటిషన్ వెబ్‌సైట్‌లో ఈ పిటిషన్‌కు మద్దతుగా వెల్లువెత్తుతున్న సంతకాలతో ఓ దశలో ఈ వెబ్‌సైట్‌ క్రాష్ అయింది. వేలసంఖ్యలో బ్రిటన్ వాసులు ఈ పిటిషన్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్నారు. ‘ఉండాలా? విడిపోవాలా? అన్న అంశంపై రెఫరెండ్‌లో మెజారిటీ ఓట్లు 60శాతానికి తక్కువగా ఉండి.. మొత్తం ఓటింగ్ 75శాతానికి తక్కువగా ఉన్నప్పుడు ఆ సమయంలో రెండోసారి రెఫరెండం నిర్వహించాలన్న నిబంధనను ఇప్పుడు అమలుచేయాలని కోరుతూ మేం ఈ సంతకాలు చేపడుతున్నాం’ అని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈయూలో బ్రిటన్ ఉండాలా? వద్దా? అనే అంశంపై గురువారం జరిగిన చరిత్రాత్మక రెఫరెండంలో 72.2శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే. సాధారణంగా పార్లమెంటు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైన పిటిషన్‌కు లక్ష సంతకాలు వస్తే.. ఆ అంశంపై దిగువ సభైన హౌస్ ఆఫ్ కామన్స్ లో చర్చిస్తారు. తాజా పిటిషన్ కు ఇందుకు అవసరమైన సంతకాల కన్నా అధికంగా వచ్చిన నేపథ్యంలో మంగళవారం సమావేశం కానున్న పార్లమెంటు పిటిషన్ కమిటీ.. ఈ పిటిషన్ పై పార్లమెంటులో చర్చించాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.  
 

మరిన్ని వార్తలు