ఆరోసారి అణు పరీక్షలు

4 Sep, 2017 10:23 IST|Sakshi
ఆరోసారి అణు పరీక్షలు

వెనక్కి తగ్గని ఉత్తర కొరియా

టోక్యో: అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నా ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆరో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని, ఈసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా ఆదివారం ప్రకటించింది. తాజాగా నిర్వహించిన ప్రయోగం పరిపూర్ణ విజయం సాధించినట్టు వెల్లడించింది. ఈ అణు పరీక్ష వాస్తవిక సామర్థ్యం ఎంత అనేదానిపై స్పష్టత రాలేదు. దక్షిణకొరియా వాతావరణ ఏజెన్సీ మాత్రం ప్రస్తుత ప్రయోగం వల్ల వచ్చిన ప్రకంపనలు గత ప్రయోగాల కంటే ఐదారురెట్లు ఎక్కువని వెల్లడించింది. దీని వల్ల చైనా, రష్యాలో పలు భవనాలు కంపించినట్టు పేర్కొంది.

మండిపడిన ట్రంప్‌
ఉత్తరకొరియా అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ఉత్తరకొరియా ప్రకటనలు.. చేష్టలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. ఉత్తరకొరియాను వంచక దేశం(రోగ్‌ నేషన్‌)గా ట్రంప్‌ అభివర్ణించారు. వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాకు ఉత్తరకొరియా ఇబ్బంది, ప్రమాదకరంగా మారిందని, చైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. కొంతవరకే విజయవంతమైందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాను బుజ్జగించే చర్యలు ఫలించవని చెపుతూ.. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు.

దూకుడు నిర్ణయాలు వద్దు: చైనా
మరోవైపు మిత్రదేశం చైనా కూడా ఉత్తరకొరియా చర్యను ఖండించింది. దుందుడుకు చర్యలు, నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత క్షిణిస్తుందని, ఇలాంటి వాటిని ఆపేయాలని, అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి చర్చలకు ముందుకు రావాలని సూచించింది.

ఉత్తరకొరియా అణుపరీక్ష నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ నేతృ త్వంలో జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఉత్తరకొరియాపై తాజాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించాలని, ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు మరిన్ని అమెరికా బలగాలను దించాలని మూన్‌ డిమాండ్‌ చేశారు. జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే ఉత్తరకొరియా అణుపరీక్షలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉత్తరకొరియా అణు పరీక్షల నేపథ్యంలో ట్రంప్, అబే తాజా పరిస్థితులపై ఫొన్‌లో మంతనాలు జరిపారు.

కృత్రిమ భూకంప తీవ్రత 6.3
స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12.29 గంటల సమయంలో గతంలో అణు పరీక్షలు నిర్వహించిన పున్‌ గ్యేరీ ప్రాంతంలోనే ఉత్తరకొరియా తాజా అణుపరీక్ష నిర్వహించింది. సియోల్‌లోని అధికారులు ఈ ప్రయోగం వల్ల ఏర్పడ్డ కృత్రిమ భూకంపం తీవ్రత 5.7గా ప్రకటిస్తే.. అమెరికా జియోలాజికల్‌ సర్వే దీని తీవ్ర తను 6.3గా వెల్లడించింది. గతంలో ఉత్తర కొరియా నిర్వహించిన అణుపరీక్షల్లో అతి ఎక్కువ భూకంపం తీవ్రత 5.3 మాత్రమే. ఈ పరీక్షలకు సంబంధించి ఉత్తరకొరియా ప్రభుత్వ టీవీ చానల్‌ ఆదివారం ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేసింది.

అంతకు ముందు అధికార పార్టీ పత్రిక తన పతాక శీర్షికలో అణ్వాయుధాలను మోహరించిన ఖండాంతర క్షిపణిని కిమ్‌ పరిశీలిస్తున్న ఫొటోలను ప్రచురిం చింది. ఉత్తరకొరియా ప్రయోగించిన హైడ్రోజన్‌ బాంబు సామర్థ్యం 70 కిలోటన్నులు ఉంటుందని జపాన్‌ రక్షణ మంత్రి ఇట్సునోరి ఒనోడెరా వెల్లడించారు. గత పరీక్షల్లో ఇది 10–30 కిలో టన్నులు మాత్రమేనని అన్నారు. ఇది హైడ్రోజన్‌ బాంబే అనే విషయాన్ని కొట్టిపారేయలేమని, అయితే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆయుధాన్ని విజయ వంతంగా ఉత్తరకొరియా ప్రయోగించిందనేది వాస్తవమని చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా