చూడగానే ముద్దొచ్చేస్తుందోచ్..!

18 Feb, 2016 12:46 IST|Sakshi
చూడగానే ముద్దొచ్చేస్తుందోచ్..!

ఆస్ట్రేలియా: కంగారులకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా. భూమిపై ఉన్న జంతువుల్లో ఇవే ప్రత్యేకమైనవి. వీటి ఆకృతిగానీ, జీవన శైలిగాని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉండే ఈ కంగారుల్లో కొన్ని రకాల కంగారులు ఇప్పుడు చూడముచ్చటగొలుపుతున్నాయి. ఇప్పటి వరకు గొంచెం గోధుమ రంగులో ఉండే కంగారులను మాత్రమే మనం చూడగా తాజాగా తెల్లటి ఆల్బినో కంగారులు కంటపడుతున్నాయి.

వాటిని చూడగానే అమాంతం దగ్గరకు వెళ్లి హత్తుకొని ప్రేమగా ముద్దుపెట్టాలన్నంత అందంగా కనిపిస్తున్నాయి. రోస్ మేరీ ఫామాన్ అనే మహిళ తన భర్తతో కలిసి దక్షిణ ఆస్ట్రేలియాలోని ముర్రే నదిగుండా కారు ప్రయాణంలో సాగిపోతుండగా అనూహ్యంగా ఓ తెల్లటి కంగారు కంచెపై నుంచి తలబయటకు పెట్టి చూస్తూ దర్శనమిచ్చింది. అది చూసి అబ్బురపడిన ఆమె ఒక్కసారిగా తన కారును ఆపేసి చేతిలోని కెమెరాతో క్లిక్ మనిపించింది.

ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టగా క్షణాల్లోనే పదివేల లైక్లు రాగా.. పన్నెండు వేలమంది షేర్ చేసుకున్నారు. 'సాధరణంగా నేను ప్రతిరోజు వందల కంగారులను చూస్తాను. కానీ, ఇంత వరకు ఈ అడవిలో ఆల్బినో కంగారును మాత్రం చూడలేదు. తొలిసారి చూసి ఆశ్చర్యపోయా. నేను ఫొటో తీస్తుండగానే మమ్ములను దాటేసుకుంటూ అది వెళ్లిపోయింది' అని రోస్ మేరి ఫామాన్ చెప్పింది.

మరిన్ని వార్తలు