అబ్దుల్‌ కరీం... రాణి విక్టోరియా!

11 Oct, 2017 02:13 IST|Sakshi

బ్రిటన్‌ రాజదర్బార్‌లో ఉన్నత పదవినలంకరించిన భారతీయుడు

లండన్‌: 19వ శతాబ్దం చివర్లో బ్రిటన్‌ రాజదర్బార్‌లో ఉన్నత పదవిలో పనిచేసిన తొలి భారతీయుడు అబ్దుల్‌ కరీంకు ‘విక్టోరియా అండ్‌ అబ్దుల్‌’ సినిమా ద్వారా చరిత్రలో మళ్లీ సముచిత స్థానం లభించిందని ఆ సినిమాకు మూలాధారమైన నవలా రచయిత పేర్కొన్నారు. ‘విక్టోరియా అండ్‌ అబ్దుల్‌: ద ఎక్స్‌ట్రార్డినరీ ట్రూ స్టోరీ ఆఫ్‌ ద క్వీన్స్‌ క్లోజెస్ట్‌ కాన్ఫిడాంట్‌’ (రాణికి అత్యంత విశ్వాసపాత్రుడి గొప్ప వాస్తవ కథ) నవలను యూకేకు చెందిన శర్బానీ బసు రచించారు.

దీని ఆధారంగా తెరకెక్కించిన విక్టోరియా అండ్‌ అబ్దుల్‌ సినిమా బ్రిటన్‌లో సెప్టెంబర్‌లో విడుదలైంది. భారత్‌లోనూ శుక్రవారం విడుదల కానుంది. అబ్దుల్‌ కరీంను నాటి బ్రిటన్‌ రాణి విక్టోరియా అమితంగా అభిమానిం చేది. దర్బారులో ఆయనకు గౌరవం కల్పించడంతోపాటు మున్షీ (భాషా ఉపాధ్యాయుడు) పదవి ఇచ్చింది. కరీం ఆమెకు భారతీయ వంటకాలు చేసిపెట్టడంతోపాటు, ఉర్దూ కూడా నేర్చించారు.  అయితే ఈ విషయాలు చాలామందికి నచ్చేవి కావు. చివరకు 1901లో విక్టోరియా చనిపోయాక కరీంను భారత్‌కు పంపారు. 1909లో కరీం మరణించారు.

మరిన్ని వార్తలు