అబార్షన్‌ చట్టబద్ధమయ్యేనా?

25 May, 2018 02:43 IST|Sakshi

ఐర్లాండ్‌లో నేడే రిఫరెండం

తల్లి ప్రాణం మీదికి వచ్చినా సరే..కడుపులో ఉన్న బిడ్డను తొలగించకూడదు అక్కడ. ఐర్లాండ్‌లో  మొదటి నుంచి అబార్షన్‌ వ్యతిరేక చట్టం కట్టుదిట్టంగా అమలవుతోంది. మరి ఒక భారతీయ మహిళ విషాదభరిత మృతి ఆ చట్టాన్ని మారుస్తుందా? గర్భస్రావంపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐరిష్‌ మహిళలు చేస్తున్న పోరాటం ఫలించేనా? ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అన్న అంశంపై నేడు రిఫరెండం జరగనుంది. సుమారు ఆరేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన సవిత హలప్పనవర అనే మహిళ ఈ కఠిన చట్టం వల్లే సకాలంలో అబార్షన్‌ జరగక మరణించింది. ఆమె మృతి ఎందరినో కదిలించడంతో ప్రజాభిప్రాయ సేకరణకు ఐర్లాండ్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

అప్పుడేం జరిగిందంటే..
ఐర్లాండ్‌లో నివసిస్తున్న దంత వైద్యురాలు సవిత(31) మూడో నెల గర్భవతిగా ఉన్న సమయంలో విపరీతమైన నడుం నొప్పితో 2012 అక్టోబర్‌ 21న గాల్వేలోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు అబార్షన్‌ చేయాల్సిందేనని నిర్ధారించారు. గర్భస్థ శిశువు గుండెకొట్టుకోవడం ప్రారంభం కావడంతో చట్టపరంగా అబార్షన్‌ చేయడానికి వీల్లేదని భావించిన వైద్యులు.. సహజంగా గర్భస్రావం అవుతుందేమోనని రెండు, మూడు రోజులు వేచి చూశారు. ఈలోపు ఆమె గర్భాశయానికి ఇన్‌ఫెక్షన్‌ సోకి సెప్టిక్‌గా మారి సవిత ప్రాణాల మీదికొచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకి మందుల ద్వారా అబార్షన్‌ చేశారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సవిత అక్టోబర్‌ 28న తుది శ్వాస విడిచింది. దేశంలోని కఠినమైన అబార్షన్‌ చట్టాలే సవిత ప్రాణాలు తీశాయంటూ ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ చట్టాల్ని తక్షణమే ప్రక్షాళన చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. సవిత మృతిపై  ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్‌.. గర్భస్రావం చట్టాన్ని సవరించాలంటూ సిఫార్సు చేసింది.

సవితను గుర్తుకు తెచ్చుకోండి
ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలోనూ తమ కుమార్తె దేశంకాని దేశంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో మరణించడం సవిత తల్లిదండ్రుల్ని కలచివేసింది. తమ కూతుర్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని సవిత తండ్రి అందనప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిఫరెండంలో ఓటేసే ముందు ఐర్లాండ్‌వాసులు తమ కూతురిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పరిస్థితి మరేతల్లిదండ్రులకు రాకూడదని ఆయన అంటున్నారు. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్‌ వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. మరి రిఫరెండంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారో మరో రోజులో తేలనుంది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు