ఇదీ ఐసీజే

19 May, 2017 02:24 IST|Sakshi
ఇదీ ఐసీజే

రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన న్యాయ సంస్థగా 1945 జూన్‌లో నెదర్లాండ్స్‌లోని దక్షిణ హాలండ్‌ ప్రావిన్సు, ద హేగ్‌ నగరంలోని శాంతి సౌధంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఏర్పాటైంది. ఐరాస ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఈ ప్రపంచ న్యాయస్థానం ఒక్కటే న్యూయార్క్‌ వెలుపల ఉండడం విశేషం. సభ్య దేశాలు నివేదించిన న్యాయపరమైన వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించడం దీని బాధ్యత.

ఐరాస అధికార విభాగాలు, ప్రత్యేక సంస్థలు అడిగిన న్యాయపరమైన అంశాలపై ఇది సలహాపూర్వకమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. ఇలా రెండు రకాల విచారణ పరిధి ఐసీజేకు కల్పించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా మొత్తం 15 మంది ఎన్నికైన న్యాయమూర్తులతో ఐసీజే పనిచేస్తుంది. ఐసీజే  జడ్జీలను ఐరాస జనరల్‌ అసెంబ్లీ, భద్రతా మండలి ఎన్నుకుంటాయి. ఈ రెండు సంస్థల సంయుక్త సమావేశాల్లో, విడివిడి సమావేశాల్లో పూర్తి మెజారిటీ వచ్చిన వారే న్యాయమూర్తులుగా ఎన్నికవుతారు. ఐసీజే ప్రస్తుత అధ్యక్షుడు రోనీ అబ్రహాం ఫ్రాన్స్‌కు చెందిన న్యాయకోవిదుడు.

 ఐసీజే జడ్జీగా ఎన్నికైతే స్వతంత్రులే...
ఒకసారి ఐసీజే జడ్జీగా ఎన్నికైన తర్వాత ఎవరూ కూడా వారి దేశాల ప్రభుత్వాలకుగానీ, మరేదైనా దేశాల(ప్రభుత్వాల)కుగానీ ప్రతినిధులు కారు. ఐరాస ఇతర విభాగాల్లో దేశాల ప్రతినిధులుంటారు. ఈ జడ్జీలు మాత్రం స్వతంత్రులు. ఏక కాలంలో ఒకే దేశానికి చెందిన ఇద్దరు జడ్జీలుగా ఉండడానికి వీల్లేదు. భద్రతా మండలిలో సభ్యత్వం మాదిరిగానే ఆఫ్రికా నుంచి ముగ్గురు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాల నుంచి ఇద్దరు, ఆసియా నుంచి ముగ్గురు, తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇద్దరు, పశ్చిమ ఐరోపాతోపాటు పలు ఇతర దేశాల నుంచి ఐదుగురు, చొప్పున జడ్జీలు ఐసీజేలో ఉంటారు.

 జడ్జీలుగా చేసిన భారతీయులు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దల్వీర్‌ భండారీ ఐసీజే ప్రస్తుత 15 మంది జడ్జీల్లో ఒకరు. ఆయన 2012లో ఎన్నికయ్యారు. ఆయనకు ముందు భారత్‌కు చెందిన సర్‌ బెనెగళ్‌ నర్సింగ్‌రావు(1952–53), డా.నాగేంద్రసింగ్‌(1973–88), ఆర్‌ఎస్‌ పాఠక్‌(1988–90) ఐసీజే జడ్జీలుగా పనిచేశారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా కూడా పనిచేసిన నాగేంద్రసింగ్‌ 1985–88 మధ్య మూడేళ్లు ప్రపంచ కోర్టు ప్రెసిడెంట్‌గా సేవలందించడం విశేషం. 1950లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి ఎంసీ చాగ్లా, 2002లో సుప్రీంకోర్టు మాజీ జడ్జీ బీపీ జీవన్‌రెడ్డిలు ఐసీజే తాత్కాలిక(అడ్‌హాక్‌) జడ్జీలుగా పనిచేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా