శునకాలు అంత తెలివైనవేమీ కావు! 

1 Oct, 2018 21:56 IST|Sakshi

లండన్‌: ‘శునకాలు చాలా తెలివైనవి. మిగతా జంతువులతో పోలిస్తే అవి అత్యంత ప్రతిభను కనబరుస్తాయి’. సాధారణంగా శునకాల విషయంలో ఎక్కువ మంది భావన ఇది. అయితే మనం అనుకుంటున్నట్లు శునకాలు అంత తెలివైనవేమీ కావని తాజా అధ్యయనంలో తేలింది. యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్ట్సర్, క్రైస్ట్‌ చర్చ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధనల్లో భాగంగా శునకాలతో పాటు ఇతర పెంపుడు జంతువులు, వేటాడే జీవులు, ఇతర మాంసాహార జీవుల మేథో శక్తిని పోల్చి చూశారు. వీటిలో శునకాలతో పాటు తోడేళ్లు, ఎలుగుబంట్లు, సింహాలు, హైనాలూ ఉన్నాయి. శునకాలు ప్రదర్శించే మేధో సామర్థ్యాలను ఇతర జంతువులూ అదే స్థాయిలో కలిగి ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. ‘పరిశోధనలో భాగంగా మేం నిర్వహించిన కొన్ని టాస్కుల్లో శునకాలతో పాటు ఇతర జంతువులూ ఒకే రీతిలో పాల్గొన్నాయ’ని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ లీ తెలిపారు. ఇందులో భాగంగా పరిశోధకులు శునకాలతో పాటు ఇతర జంతువుల మేధస్సుకు సంబంధించిన దాదాపు 300 పరిశోధన పత్రాలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయం వెల్లడించినట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు