కరోనాకు మందు కనిపెడితే రూ. కోటి ఇస్తా!

11 Feb, 2020 18:33 IST|Sakshi

బీజింగ్‌ : చైనాను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు వుహాన్‌ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తమ దేశ పరిస్థితిని చూసి అక్కడి బహళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నాయి. అలీబాబా గ్రూప్, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ సహా పలువురు వ్యాపారవేత్తలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి. తాజాగా చైనా ప్రముఖ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్‌పై స్పందించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రిని విరాళం ఇచ్చిన ఆయన.. మరో కీలక ప్రకటన చేశారు. కరోనాకు మందు కనిపెట్టిన వారికి 1 మిలియన్ యువాన్(రూ. 1 కోటి) రివార్డ్‌గా ఇస్తానని ప్రకటించారు.
(ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!)

కరోనాపై పోరాటం కోసం చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) సాయం చేశారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వేలాది మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో చైనాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు