తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక

22 Jul, 2020 20:02 IST|Sakshi

కాబుల్‌ : అఫ్గానిస్తాన్‌లో ఓ బాలిక తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్న ఘటన సంచలనంగా మారింది. తన తల్లిదండ్రులను చంపిన ఇద్దరు తాలిబన్లను ఆమె కాల్చివేశారు. తాలిబన్లపై బుల్లెట్ల వర్షం కురిపించిన ఆ బాలికను గెరివేహ్‌ గ్రామానికి చెందిన కమర్‌ గుల్‌గా గుర్తించారు. అయితే ప్రస్తుతం భద్రత దృష్ట్యా ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కమర్‌ గుల్‌ తండ్రి గెరివేహ్ గ్రామ పెద్దగా ఉన్నారు. అయితే అతను ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం.. తాలిబన్లకు రుచించలేదు. దీంతో అతని ఇంటిపైకి దాడికి దిగారు. ఇంట్లో ఉన్న అతన్ని బయటకు లాకొచ్చి కాల్చివేశారు. దీనిని అడ్డుకున్న అతని భార్యను కూడా చంపేశారు.(వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం)

కళ్లముందే తాలిబన్లు తన తల్లిదండ్రులను చంపేయడంతో రగిలిపోయిన కమర్‌.. ఇంట్లో నుంచి ఏకే-47 తీసుకొచ్చి వారిపై కాల్పులపై దిగారు. మొదటగా తన తల్లిదండ్రులను చంపిన ఇద్దరు తాలిబన్లను ఆమె మట్టుబెట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న తీవ్రవాదులపైన కూడా తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న మరికొందరు తాలిబన్లు కమర్‌ ఇంటిపై దాడి చేసేందుకు వచ్చారు. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్‌)

అయితే అప్పటికే కమర్‌ను, ఆమె తమ్ముడిని స్థానికులు, భద్రత బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ప్రస్తుతం తాలిబన్లపై బుల్లెట్ల వర్షం కురిపించిన కమర్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది ఆమె ధైర్యాన్ని మెచ్చకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు