యుద్ద భూమిలో శాంతి పుష్పాలు

17 Mar, 2016 17:37 IST|Sakshi
యుద్ద భూమిలో శాంతి పుష్పాలు

మీరు కాబూల్ డౌన్ టౌన్ కి వెళితే.. యుద్దంతో శిధిలమైన నగరంలో.. నెత్తి మీద హెల్మెట్లు.. అత్యాధునిక గేర్ సైకిళ్లపై సగర్వంగా తిరిగే అమ్మాయిలని తప్పకుండా గమనిస్తారు. వీరంతా అలాంటి.. ఇలాంటి యువతులు కాదు.. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి పోటీ పడుతున్న యువతులు.. తమపై అమలు అవుతున్న కట్టుబాట్లపై నిశ్శబ్ద యుద్ధం చేస్తున్న వారు..

తాలిబాన్ రాజ్యం కూలిపోయినా.. ఇంకా పాత వాసనలు పోని దేశంలో  మహిళలు సైక్లింగ్ వంటి క్రీడను కెరీర్ గా ఎంచుకోవడం మామూలు విషయం కాదు. అయితే చాలా మంది ఆఫ్ఘన్ యువతులు తమ కట్టుబాట్లను దాటి వస్తున్నారు. ఇలా చేసేందుకు ఎంతో ధైర్యం కావాలి అంటారు ఆప్ఘనిస్తాన్  సైక్లింగ్ ఫెడరేషన్ సారథి జహ్రా. తమ జట్టులో యువతులంతా ఎంతో ధైర్యవంతులని ప్రశంసలు కురిపించారు. బామియాన్ కి చెందిన జహ్రా తో సహా  ప్రస్తుతం జాతీయ సైక్లింగ్ జట్టులో 40 మంది యువతులున్నారు. వీరంతా నోబెల్ శాంతి బహుమానానికి నామినేట్ అయ్యారు. తమను అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు జహ్రా.


జహ్రా అండ్ టీమ్ ను.. ఇటలీకి చెందిన ఎంపీలు నామినేట్ చేశారు. పార్టీలకు అతీతంగా.. ఏకంగా 118 మంది పిటిషన్ పై సంతకం చేశారు. యుద్ధంతో ధ్వంసమైన ఆప్ఘన్ రోడ్లపై సైకిళ్లు తొక్కుతున్న మహిళలు తమ దేశంలో స్వేచ్చ కోసం, హక్కుల కోసం, శాంతి కోసం సున్నితమైన యుద్ధం  చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఈ సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ నేత ఎర్మెట్ రియాల్సీ మీడియాకు తెలిపారు.

అయితే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది జహ్రా. బామియాన్ బయట. కాబూల్ లో సైకిళ్లు తొక్కేందుకు యువతను ప్రోత్సహించింది. అదేమంత సులువుగా జరగలేదు. తాలిబన్ సంస్కృతి ఇంకిపోయిన సమాజంలో మహిళలు సైకిళ్లపై ప్రయాణించడం అంటే సవాలే. ఇక యువకులతో కలిసి సైకిల్ రైడ్ అంటే మరో రకం సమస్య. జాతీయ సైక్లింగ్ జట్టు సభ్యురాలు హాలిమా హబీబీ మాటల్లో చెప్పాలంటే.. 'నేను రోడ్లమీద ఎదుర్కోని సమస్య లేదు. వివక్ష, వేధింపులు సర్వ సాధారణ విషయాలు' అంటారు. దూషణలకు దిగే పోకిరీలకు సున్నితంగా సమాధానం చెప్పి దూసుకు పోవడం మాత్రమే చేయగలం అంటారామె.

అయితే.. ఇది చిన్న అంశం మాత్రమే. మహిళా సైక్లిస్టుల గురించి చులకనగా మాట్లాడటం తో పాటు. కుటుంబ సభ్యులపై భారీ ఒత్తిడి ఉంటుంది. ఇక వీళ్లకు వచ్చే పెళ్లి సంబంధాలకు లెక్కేలేదు. సంబంధాల కంటే.. ఎక్కువ తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తాయి. అయితే.. వీళ్ల తొలి ప్రయారిటీ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనటమే అని చెబుతారు జహ్రా. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పోటీ పడేందుకు.. వారంలో మూడు నాలుగు రోజులు, కఠినమైన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే... పోటీలో వీళ్ల తొలి ప్రత్యర్థి మాత్రం సంప్రదాయ వాదులే. తాలిబన్ ప్రభుత్వం కూలిపోయినా.. ఇప్పటికీ బెదిరింపులు సర్వసాధారణమే. ఒక్కొక్క సారి సైక్లిస్టులపై చేతికి దొరికిన వస్తువులను విసురుతుంటారు.

కానీ.. వీటన్నింటినీ తట్టుకుని సైక్లింగ్ చేస్తున్నామని వివరించారు. సైకిల్ పై దూసుకు పోతుంటే.. స్వేచ్చగా ఆలోచించుకునే ధైర్యం వస్తుందని చెబుతారు. ' నా చిన్నప్పుడే తల్లి దండ్రులు చనిపోయారు. మా అక్క నన్ను మగపిల్లాడిలానే పెంచింది. సమాజంలో మగపిల్లలు అనుభవించే స్వేచ్చ నాకు దొరికింది. అదే నన్ను నా సహచర ఆఫ్ఘన్ మహిళల కంటే భిన్నంగా నిలిపిందని' వివరించారు జహ్రా.

హాలియా మాటల్లో చెప్పాలంటే.. 'మీరు మమ్మల్ని చంపాలని ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే.. మేం అంతగా.. ప్రతిఘటిస్తాం' అని చెప్పే వీళ్లు..  నోబెల్ బహుమతి గెలవక పోయినా, ఆ బహుమతి రాక పోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పటికే ఈ యువతులంతా విజేతలు. సంప్రదాయవాద సమాజంలో కూరుకు పోయిన సాటి మహిళలకు స్వేచ్చ పై ఆశ కలిగిస్తున్నారు. తాలిబన్ ఏలుబడి తమపై రుద్దిన సంప్రదాయాలను బద్దలు కొడుతూ.. నిశ్శబ్ద విప్లవాన్ని తెస్తున్నారు.


 

>
మరిన్ని వార్తలు