ఆడపిల్లాడు! 

23 Apr, 2018 22:55 IST|Sakshi

పదేళ్లుగా మగపిల్లాడిలా మారువేషంలో అఫ్ఘాన్‌ బాలిక 

సుల్తాన్‌పూర్‌ (అఫ్ఘానిస్థాన్‌) : సితార.. అనగానే సినిమా తారలే గుర్తుకొస్తారు. యాక్షన్‌ అని చెప్పినప్పుడు మాత్రమే తారలు నటిస్తారు. కానీ అఫ్ఘాన్‌కు చెందిన సితార మాత్రం అనుక్షణం నటిస్తూనే ఉంది. గత పదేళ్లుగా మగపిల్లాడిలా మారువేషంలో జీవిస్తూనే ఉంది. వివరాల్లోకెళ్తే.. 

మగసంతానం లేని దంపతులు ఆడపిల్లల్లో ఒకరిని మగాడిలా పెంచాలని ముచ్చటపడతారు. చిన్నప్పటి నుంచే మగపిల్లల డ్రెస్సులు వేస్తూ తమ ముచ్చట తీర్చుకుంటారు. అఫ్ఘానిస్థాన్‌లోని సితార వఫాదార్‌ తల్లిదండ్రులు కూడా ఆమెను అలాగే పెంచారు. ఐదుగురు ఆడపిల్లల తర్వాత ఆరో సంతానంగా జన్మించడంతో మగపిల్లాడి ముచ్చట తీర్చుకునేందుకు అలా పెంచుతున్నారని అంతా అనుకున్నారు. సితార కూడా చిన్నప్పుడు మగపిల్లాడిగా పెరిగేందుకే ముచ్చట పడింది. ఆ ముచ్చటే ఆమెను ఇప్పుడు ఇటుక బట్టీలో కూలీని చేసింది. 

కుటుంబ బాధ్యతలు మోసే కొడుకులా.. 
తండ్రితో కలిసి సితార కూడా రోజూ ఇటుక బట్టీలో పనిచేసేందుకు వెళ్తుంది. అయితే అక్కడ ఎవరికీ ఆమె ఆడపిల్ల అనే విషయం తెలియదు. ఒకవేళ తెలిస్తే అక్కడ ఆమెకు పనే ఉండదు. అదీగాక మరెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అందుకే కాస్త పొడవుగా ఉన్న వెంట్రుకలను చున్నీతో కప్పేస్తూ.. గొంతును తగ్గించుకొని మాట్లాడుతూ.. తనపని తాను చేసుకుంటుంది. రోజుకు 500 ఇటుకలు చేస్తే ఆమె చేతికి వచ్చేది 160 రూపాయలు. అవి రాకపోతే కుటుంబం పస్తులుండాల్సిందే.  

ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా..
అఫ్ఘానిస్థాన్‌లో మగసంతానం లేని చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఇలా పెంచడం సాధారణమే. అయితే కొంత వయసు వచ్చేవరకే దానిని పరిమితం చేస్తారు. ఆ తర్వాత ఆడపిల్లలా బతకాల్సిందే. కానీ సితార అలా కాదు.. అసలు ఆమె ఆడపిల్ల అనే విషయమే బయటి ప్రపంచానికి తెలియదు. మరి ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా? అని అడిగితే.. తెలిసే వరకు ఇలాగే ఉంటానని చెబుతోంది. 

మేమే మగపిల్లాణ్ని చేశాం..
‘సితారను ఆడపిల్ల అని చెప్పుకోవడం కంటే మగపిల్లాడిగానే ప్రపంచానికి పరిచయం చేయడానికి మేం ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఆమె ఆడపిల్ల అని తెలిస్తే.. కుటుంబంలో బయటకు వెళ్లి పనిచేసేవారు ఎవరూ ఉండరు. ఆమె తండ్రి ఇప్పటికే వృద్ధుడైపోయాడు. నాకు మందులు తేవాలన్నా, డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలన్నా మగపిల్లాడు కావాల్సిందే. అందుకే సితారను మా అవసరాల కోసమే మగపిల్లాణ్ని చేశామంటోంది సితార తల్లి.

మరిన్ని వార్తలు