తాలిబన్ల విడుదలకు అధ్యక్షుడి ఆదేశాలు

11 Mar, 2020 10:50 IST|Sakshi

కాబూల్‌: జైలు నుంచి తాలిబన్లను విడుదల చేసేందుకు అఫ్గనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దశలవారీగా వారిని విడుదల చేయాలంటూ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి సిదిఖ్‌ సిద్ధిఖీ ధ్రువీకరించారు. దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని షరతు విధించింది. తొలుత ఇందుకు అంగీకరించని అఫ్గాన్‌ అధ్యక్షుడు ఘనీ... మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్‌ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.(అమెరికా– తాలిబన్‌ మధ్య చారిత్రక ఒప్పందం)

ఈ విషయం గురించి అష్రాఫ్‌ ఘనీ అధికార ప్రతినిధి సిదిఖ్‌ సిద్దిఖీ మాట్లాడుతూ.. శనివారం నుంచి తాలిబన్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొదటి రోజు వంద మంది చొప్పున.. 1500 మందిని రిలీజ్‌ చేస్తామన్నారు. ఇక ఆఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన తర్వాత... రెండు వారాలకు మిగిలిన 3500 మందిని 500 మంది చొప్పును విడుదల చేస్తామని వెల్లడించారు. హింసకు పాల్పడబోమంటూ తాలిబన్లు హామీ ఇచ్చిన మేరకే ఈ నిర్ణయం సాఫీగా అమలువుతుందనే షరతుతో ముందుకు సాగుతామన్నారు. తాలిబన్ల విడుదలకు సంబంధించిన డిక్రీపై అధ్యక్షుడు ఘనీ సంతకం చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు.

కాగా అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలోనే తాలిబన్ల విషయంలో ఘనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారం ఘనీ, ఆయన మాజీ చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ అబ్దుల్లాలు తామే ఆఫ్గనిస్తాన్‌ అధ్యక్షులం అంటూ పోటాపోటీగా ప్రమాణ స్వీకారోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఘనీ పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నపుడు అక్కడ రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకు చెక్‌పెట్టేందుకు ఘనీ వేగంగా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో కుదుర్చుకున్న చారిత్రక శాంతి ఒప్పందానికి భారత్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు