అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు

10 Mar, 2020 05:01 IST|Sakshi
వేర్వేరు కార్యక్రమాల్లో అధ్యక్షులుగా ప్రమాణంచేస్తున్న అబ్దుల్లా, ఘనీ

అఫ్గానిస్తాన్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ, అతడి మాజీ చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య రాజకీయ పోరు ఎక్కువైంది. సోమవారం ఘనీ, అబ్దుల్లాలు తామే అధ్యక్షులం అంటూ ప్రమాణ స్వీకారోత్సవాలు జరుపుకున్నారు. దశాబ్దకాలం యుద్ధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ అమెరికా దళాలు అఫ్గానిస్తాన్‌ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి.

అయితే ఘనీ, అబ్దుల్లా వర్గాలు రెండు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపణలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఫలితాల వెల్లడిలో ఆలస్యమైంది. చివరకు గత నెలలో  ఘనీ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయ దుస్తులతో అధ్యక్ష భవనానికి విచ్చేసిన అష్రాఫ్‌ మద్దతుదారులు, ఉన్నతాధికారులు దౌత్యవేత్తలు, అమెరికా ప్రత్యేక ప్రతినిధి జలమే ఖాలిజాద్‌ల సమక్షంలో ప్రమాణం చేశారు.

దాదాపుగా అదే సమయానికి అధ్యక్ష భవనం మరో మూల సూటు బూటులతో విచ్చేసిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సరిహద్దులను కాపాడతానని ప్రమాణం చేశారు. అయిత అష్రాఫ్‌ ఘనీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో వందలాదిమంది ప్రజలు చూస్తూండగా రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. అయినప్పటికీ ఆ ప్రాంగణాన్ని వదిలి వెళ్లేందుకు అష్రాఫ్‌ ఘని నిరాకరించడం ‘ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడేది లేదు’ అని వ్యాఖ్యానించడంతో కొంత సమయం తరువాత అక్కడ మళ్లీ ప్రజలు, మద్దతుదారులు గుమికూడారు. అష్రాఫ్‌ను చప్పట్లతో స్వాగతించారు. అయితే ఇలా ఇరు రాజకీయ పక్షాలు పోటాపోటీ ప్రమాణాలు చేయడంపై అఫ్గానిస్తాన్‌  ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ఇరు నేతలు చర్చలు జరిపితే మేలని ప్రజలు సూచిస్తున్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా