‘ఆఫ్రికా మోనాలిసా’కు కళ్లు చెదిరే ధర..

1 Mar, 2018 12:55 IST|Sakshi

లండన్: ఫేమస్ పెయింటింగ్ ‘ఆఫ్రికా మోనాలిసా’ రికార్డు ధర పలికింది. లండన్‌లో ఫిబ్రవరి 28 రాత్రి జరిగిన వేలంలో ఏకంగా 16 లక్షల అమెరికన్ డాలర్ల (12 లక్షల యూరోలు)కు అమ్ముడైంది. చిత్రకారుడు బెన్ ఎన్‌వోను గీసీన అడెటుటు అదేమిల్యుయ్ అనే రాకుమారి పెయింటింగ్ ఆఫ్రికా మోనాలిసాకు అందరికీ సుపరిచితమే. దీన్ని అందరూ టుటుగా పిలుచుకుంటారు. అయితే 1974లో పెయింటింగ్ వేసిన కొన్ని రోజులకే మాయమైంది.

నాలుగు దశాబ్దాల అనంతరం గతేడాది లండన్‌లో ఓ అపార్ట్‌మెంట్లో టుటు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. తాజా వేలంలో ఆఫ్రికా మోనాలిసా పెయింటింగ్‌ 2.75 లక్షల డాలర్ల నుంచి 4.13 లక్షల డాలర్ల వరకు ధర పలుకవచ్చునని నిర్వాహకులు భావించారు. కానీ నిర్వాహకులు ఊహించిన దానికంటే దాదాపు నాలుగురెట్లు అధిక ధరకు టుటు పెయింటింగ్ అమ్ముడుపోవడం గమనార్హం. రాకుమారిపై వేసిన మరో రెండు పెయింటింగ్స్ ఇప్పటికీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.

ఐదు శతాబ్దాల కిందట ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన మోనాలిసా. ఎక్కడైనా అందమైన పెయింటింగ్ కనిపిస్తే మోనాలిసాతో పోల్చుతుంటారు. అదే విధంగా నైజీరియా యువరాణి టుటు పెయింటింగ్‌ను ఆఫ్రికా మోనాలిసాగా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు