పాక్పై వేటుకు భారత్కు తోడుగా మరిన్ని దేశాలు

28 Sep, 2016 09:49 IST|Sakshi
పాక్పై వేటుకు భారత్కు తోడుగా మరిన్ని దేశాలు

న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ను ఒంటరి చేయాలన్న భారత్ ప్రయత్నంలో తొలి అడుగుపడింది. త్వరలో ఇస్లామాబాద్ లో జరగనున్న సార్క్ సమావేశానికి హాజరవడం లేదని ఇప్పటికే భారత్, అప్ఘనిస్థాన్ స్పష్టం చేయగా అదే వరుసలో ఇప్పుడు మరో రెండు దేశాలు చేరనున్నాయి. తాము కూడా సార్క్ సమావేశాలకు వెళ్లడం లేదని బంగ్లాదేశ్ ప్రకటించినట్లు అధికార వర్గాల సమాచారం. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ పదేపదే జోక్యం చేసుకుంటుందని, తమ నిరసన తెలియజేసేందుకు ఇదే తగిన సమయం అని పేర్కొంటూ ఆ దేశం సార్క్ సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో దక్షిణాసియా దేశాలకు తాము ఎప్పటికీ సహకరిస్తుంటామని ఒక ప్రకటనగా  చెప్పింది. ఇదే బాటలో భూటాన్ నిలిచింది. కొన్ని సార్క్ దేశాలు ఇప్పుడు ప్రాంతీయ ప్రశాంతతను, భద్రతను ఉగ్రవాదం కారణంగా కోల్పోతున్నాయని భూటాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రాంతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుండంతోపాటు సార్క్ లో సభ్యత్వం ఉన్న కొన్నిదేశాల్లో శాంతియుత వాతావరణాన్ని ఉగ్రవాదం చెడగొడుతున్న కారణంగా తాము కూడా ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా వారు బంగ్లాదేశ్, భూటాన్ లేఖలు కూడా పంపించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు