భయానక దాడి; ప్రపంచ స్థాయి టోర్నీ రద్దు

18 Apr, 2018 09:35 IST|Sakshi

పెర్త్‌: రంపంలాంటి పళ్లతో మనుషుల్ని నమిలిమింగే సొర చేపలు(షార్క్‌లు) బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సర్ఫర్లపై భయకరంగా దాడిచేశాయి. దీంతో అట్టహాసంగా జరగాల్సిన ప్రపంచ స్థాయి సర్ఫింగ్‌ పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. వరల్డ్‌ సర్ఫ్‌ లీగ్‌(డబ్ల్యూఎస్‌ఎల్‌) ఈ మేరకు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది.

మనిషి నెత్తురు కోసం ఆరాటంగా: ఔత్సాహిక సర్ఫర్లను ప్రోత్సహిస్తూ, సాహసక్రీడను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో వరల్ట్‌ సర్ఫ్‌ లీగ్‌ ప్రపంచ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది.  తాజాగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ‘మార్గరేట్‌ రివర్‌ ప్రో’ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడి గ్రేస్‌ టౌన్‌ చుట్టుపక్క తీరాల్లో సర్ఫర్లు తమ విన్యాసాలు చేశారు. ఏప్రిల్‌ 22 వరకు జరుగనున్న ఈ ఈవెంట్‌ సొర చేపల దాడితో అర్ధాంతరంగా రద్దైపోయింది. సర్ఫింగ్‌ చేస్తోన్న క్రీడాకారులపై వరుసగా సోమ, మంగళవారాల్లో దాడులు జరిగాయి. మనిషి నెత్తురు కోసం ఆరాటపడే షార్క్‌లు చాకచక్యంగా దాడులు చేస్తాయన్న సంగతి తెలిసిందే. షార్క్‌ల దాడిలో తృటిలో ప్రాణాలను దక్కించుకున్న సర్ఫర్లను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

వెరీ సారీ: ‘‘సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సొర చేపలు దాడిని అడ్డుకోలేకపోయాం. క్రీడాకారుల భద్రత దృష్ట్యా ఈ దఫా పోటీలను రద్దు చేస్తున్నాం. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమం‍గా ఉంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నీని రద్దు చేయడం బాధాకరమే అయినా, తప్పడంలేదు. క్రీడాకారులందరికీ సారీ.’’ అని డబ్ల్యూఎస్‌ఎల్‌ అధికారిక ప్రతినిధి సోఫీ మీడియాకు వివరించారు.

మరిన్ని వార్తలు