అడల్‌కజ్‌తో మరో సైబర్‌ ముప్పు?

20 May, 2017 02:24 IST|Sakshi
అడల్‌కజ్‌తో మరో సైబర్‌ ముప్పు?

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ ప్రపంచంపై మరో దాడికి రంగం సిద్ధమైందా.. వాన్నక్రై ర్యాన్‌సమ్‌ వేర్‌ తాకిడి నుంచి కోలుకోకముందే హ్యాకర్లు అడల్‌కజ్‌ పేరుతో మరో మాల్‌వేర్‌తో దాడి చేయనున్నారా.. వాన్నక్రై కంటే తీవ్రమైన నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందా..అంటే అవునంటోంది ప్రూఫ్‌ పాయింట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. కంప్యూటర్లలోని ఫైళ్లన్నింటినీ కోడ్‌ భాషలోకి మార్చేసి సరిచేసేందుకు బిట్‌కాయిన్‌ కరెన్సీ ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేయడం వాన్నక్రై ర్యాన్‌సమ్‌వేర్‌ తీరైతే.. అడల్‌కజ్‌ ఇలాంటివేవీ చేయదు. కానీ.. మీ కంప్యూటర్ల వేగాన్ని గణనీయంగా తగ్గించేస్తుంది.

అదే సమయంలో ఇతర కంప్యూటర్లకు విస్తరిస్తూ... వర్చువల్‌ ప్రపంచపు బిట్‌కాయిన్‌ తరహా కరెన్సీ ‘మనెరో’కోసం వెతుకుతూంటుంది. అందిన మొత్తాన్ని వైరస్‌ను సృష్టించిన వారి అకౌంట్లలోకి జమచేస్తుంది. మాల్‌వేర్‌ల ద్వారా వర్చువల్‌ కరెన్సీని వెతకడం కొత్త కాకపోయినప్పటికీ ఇటీవలి కాలంలో భారీ ఎత్తున డబ్బు హ్యాకర్ల ఖాతాల్లోకి చేరుతున్నట్లు ప్రూఫ్‌పాయింట్‌ ఉపాధ్యక్షుడు రాబర్ట్‌ హోమ్స్‌ తెలిపారు. ఈ మాల్‌వేర్‌ రహస్యంగా పనిచేస్తూండటం వల్ల ఇది ఎప్పుడు, ఎలా విస్తరిస్తోందో మనెరో కరెన్సీ ఎంత సేకరిస్తోందో తెలియడం లేదని హోమ్స్‌ అంటున్నారు. బహుశా ఈ నెల 2న లేదంటే అంతకంటే ముందు ఏప్రిల్‌ 24 నుంచే ఇది వ్యాప్తి చెందుతూ ఉండవచ్చునని ప్రూఫ్‌పాయింట్‌ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు