ఈ హార్మోన్.. వయసు తగ్గిస్తుంది

1 Aug, 2016 03:03 IST|Sakshi
ఈ హార్మోన్.. వయసు తగ్గిస్తుంది

నిత్యయవ్వనంతో జీవించాలని కోరుకోని వారెవరుంటారు చెప్పండి. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో తాజాగా బ్రెజిల్, అమెరికా శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలకమైన ముందడుగు వేశారు. మానవ కణాల్లో వయోభారాన్ని తిరోగమింపజేసే హార్మోన్ ఒకదాన్ని గుర్తించారు. అయితే దీంతో మనం చిరాయువులుగా చేయకపోయినా వయోభారంతో వచ్చే సమస్యలకు మరింత సమర్థంగా చికిత్స అందించడంలో ఉపయోగపడుతుందని అంచనా.

ఇంతకీ ఆ హార్మోన్ ఏంటి..? అదెలా పనిచేస్తుంది..? అనే విషయాన్ని ఓ సారి చూద్దాం. ఇది ఓ పురుష హార్మోన్. పేరు డనాజోల్. కృత్రిమంగా తయారు చేసిన ఈ హార్మోన్.. టీలోమరేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. ఈ ఎంజైమ్ మన కణాల్లోని క్రోమోజోమ్‌ల చివరలో ఉండే టీలోమర్లు కుంచించుకుపోకుండా చేస్తాయి. వయసుతోపాటు ఈ టీలోమర్ల పొడవు తగ్గిపోతుందనే విషయం ఇప్పటికే గుర్తించారు. కణ విభజన జరిగిన ప్రతిసారి టీలోమర్ల పొడవు కొంత తగ్గుతుందని, అవి పూర్తిగా లేని స్థితి వచ్చినపుడు కణం చనిపోతుందని బ్రెజిల్‌లోని సా పాలో యూనివర్సిటీ శాస్త్రవేత్త రోడ్రిగో కలాడో చెబుతున్నారు. టీలోమరేజ్ ఎంజైమ్ ఈ ప్రక్రియను నిలిపేస్తుంది కాబట్టి కణ విభజన కొనసాగుతుందన్నమాట. ఈ ఆవిష్కరణతో అప్లాస్టిక్ అనీమియా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు