ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు శుభవార్త...

12 Apr, 2018 14:27 IST|Sakshi
ఎయిర్‌బస్‌ రూపొందించనున్న బెర్తుల నమునా

పారిస్‌ : యూరోపియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దిగ్గజం ఎయిర్‌బస్‌ తన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 2020 నాటికి ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు కూడా పడుకోని ప్రయాణించడానికి వీలుగా క్యాబిన్లలో బెర్తులను ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్‌లో ఎయిర్‌ ఫ్రాన్స్‌- కేఎల్‌ఎం ఎకానమీ క్లాసు ప్రయాణికులకు కూడా స్లీపింగ్‌ బెర్త్స్‌ కల్పించాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ వ్యయంతో రూపొందించే ఈ బెర్తులను కాబిన్‌ పై భాగంలో గాని, కింది భాగంలో గాని ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్‌బస్‌, ఫ్రెంచ్‌ అంతరిక్ష సంస్థ సఫ్రాన్‌కు అనుబంధ సంస్థ అయిన జోడాయిక్‌ ఎయిరోస్పేస్‌ కంపెనీతో కలిసి A330 కార్గో జెట్లలో లోయర్‌ డెక్‌ స్లీపింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది.

ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసే స్లీపర్‌ కంపార్ట్‌మెంట్స్‌ ప్రస్తుతం ఉన్న కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కంపార్టుమెంట్లలో సరిగ్గా సరిపోతాయని వెల్లడించింది. 2020 నాటికి A330 విమానాలకు సరిపోయే డిజైన్‌ను రూపొందించనున్నట్లు ఎయిర్‌బస్‌ తెలిపింది. ఈ ప్రయోగం ఫలిస్తే  త్వరలోనే A330XWB ఎయిర్‌లైన్స్‌లో కూడా ఈ ప్రయోగాన్ని అమలు పరిచే అవకాశాలను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్‌ బస్‌ కాబిన్‌ కార్గో ప్రోగ్రామ్‌ల ముఖ్య అధిపతి జెఫ్‌ పిన్నర్‌ మాట్లాడుతూ... ఈ మార్పు ప్రయాణికుల సౌకర్యం కోసం ఒక అడుగు ముందుకు వేయడానికి నిదర్శనమని భావించవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని మిగతా ఎయిర్‌లైన్స్‌ వారు కూడా మెచ్చుకున్నారు. ఈ ప్రయోగానికి మంచి స్పందనే వస్తుందని అన్నారు. ​లోయర్‌ డెక్‌ పరిష్కారాలను చూపడంలో తమ సంస్ధకు మంచి నైపుణ్యం ఉందని జోడాయిక్‌ ఎయిరోస్పేస్‌ కాబిన్‌ డివిజన్‌ ముఖ్య అధికారి క్రిస్టోఫ్‌ బెర్నర్డిని కూడా చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే నేడు వేర్వేరు ఎయర్‌ లైన్స్‌ మధ్య భిన్నత్వాన్ని గుర్తించడానికి కీలక అంశంగా మారిందన్నారు.

మరిన్ని వార్తలు