సరస్సులోకి దూసుకెళ్లింది..

29 Sep, 2018 04:44 IST|Sakshi

మజురో(మార్షెల్‌ ఐలాండ్స్‌): న్యూజిలాండ్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిన విమానం సరస్సులోకి దూసుకెళ్లింది.  సరుస్సు లోతుగా లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేసియా ద్వీపంలో జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్‌ న్యుగిని బోయింగ్‌ 737 విమానం వెనో విమానాశ్రయంలో దిగుతూ అదుపుతప్పింది. ఒక్కసారిగా విమానం రన్‌వే పై నుంచి పక్కనే ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది.

సరస్సు లోతు తక్కువ కావడంతో పూర్తిగా మునగలేదు.  స్థానికులు పడవలతో వెళ్లి ప్రయాణికులు, సిబ్బందిని కాపాడారు. కొందరేమో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. ప్రమాద కారణాలు స్పష్టంగా తెలియకున్నా.. ప్రమాద సమయంలో భారీ వర్షం, తక్కువ వెలుగు ఉండటం కారణం కావచ్చని ఎయిర్‌లైన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ రన్‌వే పొడవు కేవలం 1831 మీటర్లు. 2008లో ఏసియా పసిఫిక్‌ ఎయిర్‌లైన్స్‌ కార్గో బోయింగ్‌ 727 విమానం కూడా రన్‌వేను దాటి ముందుభాగం వరకు సరస్సులోకి దూసుకెళ్లింది.

మరిన్ని వార్తలు