మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త!

19 Jul, 2014 10:36 IST|Sakshi
మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త!

నాలుగు నెలల క్రితం మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైన ఘటనలో ఇద్దరు సభ్యులను కోల్పోయిన ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబం.. తాజా ప్రమాదంలో మరో ఇద్దరిని కోల్పోయి విషాదంలో మునిగిపోయింది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఇరీన్, జార్జ్ బరోస్ దంపతుల కొడుకు రోడ్నీ, కోడలు మేరీలు ‘ఎంహెచ్ 370’ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. తాజా ప్రమాదంలో మనవరాలు మేరీ రిక్, ఆమె భర్త అల్బర్ట్‌లు చనిపోవడం వారిని కలచివేస్తోంది.

 ఒకే కుటుంబంలోని ఆరుగురి మృతి.. కజకిస్తాన్ నుంచి తిరిగివస్తున్న ఒక కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మలేసియాకు చెందిన తాంబి, ఆయన భార్య,  వారి నలుగురు సంతానం.. ఈ ప్రమాదంలో చనిపోయారు.
 లక్కీ కపుల్: ఆ విమానంలో సీట్లు లభించకపోవడమే ఆ కుటుంబం పాలిట వరమైంది. స్కాట్‌లాండ్‌కు చెందిన జంట బ్యారీ, ఇజీ సిమ్ వారి పాప ‘ఎంహెచ్ 17’లో ప్రయాణించాల్సి ఉంది. విమానంలో సీట్లు లేకపోవడంతో ఆ తరువాత బయల్దేరిన కేఎల్‌ఎం ఎయిర్‌లైన్స్  విమానంలో వారు ప్రయాణించారు. ‘మేమెప్పుడూ మలేసియన్ ఎయిర్‌లైన్స్‌లోనే ప్రయాణిస్తుంటాం. ఈ సారి మాత్రం మమ్మల్నెవరో పైనుంచి గమనిస్తూ ఆ విమానం ఎక్కకుండా చేశారు’ అని ఆ జంట ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రయాణాన్ని ఒక రోజు ముందుకు జరుపుకున్న జంటను కూడా అదృష్టం వరించింది. ఆస్ట్రేలియాకు చెందిన సిమోన్ లా పస్టా, ఆమె భర్త ఎంహెచ్ 17 విమానంలోనే కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, జెట్‌లాగ్‌ను తప్పించుకునేందుకు వారు తమ ప్రయాణాన్ని ఒక రోజు ముందుకు జరుపుకుని బతికిపోయారు.

భారతీయ సంతతి వ్యక్తి మృతి

సహోద్యోగితో షిఫ్ట్ మార్చుకోవడం వల్ల మలేసియన్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ స్టీవార్డ్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన సంజిత్ సింగ్ సంధూ ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించాల్సి వచ్చి మృత్యువాత పడ్డారు. ‘మాకు వాడొక్కడే సంతానం. విమానం బయల్దేరే ముందే వాడితో ఫోన్‌లో మాట్లాడాను. వాళ్ల అమ్మ సంధూ కోసం ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసింది’ అంటూ గద్గద స్వరంతో సంధూ తండ్రి జిగర్ సింగ్ తెలిపారు. సంధూ భార్య కూడా ఫ్లైట్ స్టీవార్డ్‌గా మలేసియన్ ఏర్‌లైన్స్‌లోనే పనిచేస్తోందన్నారు.
 

>
మరిన్ని వార్తలు