రైళ్లను లక్ష్యంగా చేసుకోండి: అల్‌ కాయిదా

18 Aug, 2017 01:02 IST|Sakshi
రైళ్లను లక్ష్యంగా చేసుకోండి: అల్‌ కాయిదా

లండన్‌: విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పశ్చిమ దేశాల్లోని రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకోవాలని అల్‌కాయిదా తమ ఉగ్రవాదులకు పిలుపునిచ్చింది. రద్దీగా ఉండే రైలు మార్గాల్లో పట్టాలు తప్పించడం, రైళ్ల లోపలి నుంచి దాడికి పాల్పడటం ద్వారా భారీగా ప్రాణనష్టం కలిగించవచ్చంది. ఈ దాడి కోసం ఎలాంటి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదనీ, ఒకే వ్యక్తి మళ్లీమళ్లీ దాడులకు పాల్పడవచ్చని పేర్కొంది. ఈ మేరకు బాంబుల నిపుణుడు ఇబ్రహీం అల్‌ అసిరీ అల్‌ కాయి దా అధికార పత్రిక ‘ఇన్‌స్పైర్‌’లో 18 పేజీల వ్యాసం రాశాడు.

రైళ్లను పట్టాలు తప్పించేందుకు వాడే పేలుడు పదార్థాలను ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికాలు వాడకుండా ఎలా తయారుచేయాలో అందులో వివరించాడు. దీనివల్ల విచారణ సంస్థలకు ఎలాంటి ఆధారాలు లభించవన్నాడు. తన వ్యాసంలో ఇబ్రహీం ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లను ప్రస్తావించాడు. ‘అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. మొత్తం 2,40,000 కి.మీ రైలుమార్గంలో వాళ్లు(అమెరికా) ఎక్కడెక్కడని రక్షణ కల్పిస్తారు? అది సాధ్యం కాని పని. ఇదే అంశం బ్రిటన్‌ (18,500 కి.మీ), ఫ్రాన్స్‌ (29,743 కి.మీ)కు వర్తిస్తుంద’ని వ్యాసంలో ఇబ్రహీం తెలిపాడు.

మరిన్ని వార్తలు