ఎంత కష్టమొచ్చింది...

17 Oct, 2016 17:48 IST|Sakshi
ఎంత కష్టమొచ్చింది...

డమాస్కస్(అలెప్పో): సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. శకలాల మధ్య కాళ్లు ఇరుక్కున్న 16ఏళ్ల బాలుడు మరూఫ్ని సహాయక సిబ్బంది కాపాడుతున్న వీడియో సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది. ఈ ఘటనలో శకలాల మధ్య బాలుడి కాళ్లు ఇరుక్కోవడంతో బాలున్ని బయటకు తీయడానికి సిబ్బంది ప్రయత్నాలు చూస్తే, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందారు. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. కాగా, తీవ్రగాయాలైన మరూఫ్కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

ఆ ఘటన మరువక ముందే
అలెప్పో ప్రాంతంలో తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని ఆగష్టులో జరిగిన వైమానిక దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు, పాత్రికేయులు ఒమ్రాన్ అనే బాలుడి కుటుంబాన్ని రక్షించారు. ఒళ్లంతా తీవ్రగాయాలై రక్తమోడుతున్న బాలుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒమ్రాన్ కుటుంబాన్ని భవనం నుంచి బయటకు తీసుకొచ్చిన కొద్ది సేపట్లోనే అది పూర్తిగా కుప్పకూలింది. ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది. సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
 

మరిన్ని వార్తలు