వందశాతం వారు చెప్పినట్టే జరిగింది!

9 Nov, 2016 16:34 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్రరాజ్య ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే జోస్యం చెప్పారు. అయితే అప్పట్లో ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు సరికదా... అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. అయితే సర్వేలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులయ్యాయి. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. ఓటింగ్‌ ముందు రోజు వరకు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ విజయం ఖాయమని పలు సర్వేలు చెప్పాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయకేతనం ఎగురవేశారు.

దీంతో అమెరికన్ ప్రొఫెసర్‌ అలాన్‌ లిచట్మన్‌ జోస్యం నిజమైంది. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్పినప్పటికీ.. అలాన్‌ మాత్రం ట్రంప్‌ గెలుస్తారని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. లిచట్మన్‌ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు.

రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే విజయం సాధిస్తారని అలాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా  ట్రంప్‌ ఎందుకు గెలుస్తారో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్‌ ద నెక్ట్స్ ప్రెసిడెంట్‌: ద కీస్‌ టు వైట్‌హౌస్‌ 2016' పుస్తకాన్ని ప్రచురించారు. అప్పట్లో నమ్మకపోయినా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఈ అమెరికా ఆక్టోపస్‌ జోస్యం నిజమైందనుకుంటున్నారు.

హెల్మట్ నార్‌పోత్ మోడల్ ప్రకారం...
అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారంటూ.. యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్‌పోత్ కూడా తెలిపారు.  ఆయన మోడల్ ప్రకారం ప్రైమరీలు, కాకసెస్ (ఆ పార్టీలోని ఎన్నికైన సభ్యులు)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేత శ్వేతసౌధానికి ఎంపికవుతారు.

ఈ మోడల్‌కు మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్‌లో పార్టీపరంగా బలమైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై ప్రభావం చూపదని హెల్మట్ తెలిపారు. ఈ మోడల్ ప్రకారం 1912 నుంచి ఒబామా వరకు (2000లో తప్ప) అన్ని అంచనాలు నిజమయ్యాయి.

చెన్నై చాణక్య జోస్యం...
మరోవైపు ట్రంప్ గెలుపుపై చెన్నై 'చాణక్య' చెప్పిన జోస్యం కూడా నిజమైంది. ఈ చాణక్య.. మనిషి అనుకుంటే పొరపాటు. చాణక్య అంటే బుల్లి చేప. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచగా, అది ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని  జోస్యం చెప్పింది. రెండు రోజుల క్రితం చాణక్య చెప్పిన జోస్యంపై గురి కుదరకపోయినా తాజా ఫలితాలతో అది వాస్తవమని తేలింది. గతంలోనూ ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. అలాగే 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది. ట్రంప్ ఘన విజయంతో చాణక్య మరోసారి వార్తల్లో నిలిచింది.

మరిన్ని వార్తలు