రజనీ కాషాయమైతే పొత్తు నో

12 Feb, 2018 01:59 IST|Sakshi
కమల్‌హాసన్‌

మెజారిటీ రాకుంటే ప్రతిపక్షంలో కూర్చుంటా

హార్వర్డ్‌ కాన్ఫరెన్స్‌లో కమల్‌హాసన్‌

ఈ నెల 21న కీలక ప్రకటన చేసే అవకాశం

కేంబ్రిడ్జ్‌ (మసాచుసెట్స్‌): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాషాయ(బీజేపీ) రాజకీయాలు చేస్తే ఆయనతో ఎటువంటి రాజకీయ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు. తాము రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల రజనీకాంత్, కమల్‌హాసన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన యాన్యువల్‌ ఇండియన్‌ కాన్ఫరెన్స్‌లో కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు.

తమిళనాడులో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తమ ఆలోచనలు, మేనిఫెస్టోలో ఏకాభిప్రాయం ఉంటే రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే తమ మధ్య ప్రస్తుతం ఉన్న వ్యత్యాసం మతం.. కాషాయం మాత్రమే అని చెప్పారు.

అవసరమైతే ఎవరితోనైనా చేయి కలిపేందుకు సిద్ధమని చెప్పారు. ఎన్నికల ముందు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు లేదని సమాధానం చెప్పారు. ఎవరికీ మెజారిటీ రాకుండా ప్రజలు తీర్పు ఇస్తే.. తాను ప్రతిపక్షంలోనే కూర్చుంటానని, తర్వాత ఎన్నికల కోసం సిద్ధమవుతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు కమల్‌ వెల్లడించారు. కాగా, ఈ నెల 21న కమల్‌ హాసన్‌ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు