చనిపోయినా.. సంపాదిస్తున్నారు!

10 Oct, 2016 08:31 IST|Sakshi

వీడు చచ్చినా సాధిస్తున్నాడురా..! అని కొందరిని తిట్టుకుంటుంటాం.. కానీ, వీడు చచ్చినా సంపాదిస్తున్నాడురా! అనే మాట ఎప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం? చనిపోయిన తరువాత ఎవరైనా ఎలా సంపాదిస్తారు? అది కూడా.. కోట్ల రూపాయలా..? అస్సలు బతికి ఉన్నవాళ్లే డబ్బు సంపాదించేందుకు నానా కష్టాలు పడుతుంటే మరణించినవారికెలా సాధ్యమనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు కావాలంటే ఈ కథనం చదవాల్సిందే!
 
మైకెల్ జాక్సన్
పాప్ సంగీతానికి రారాజుగా వెలుగొందిన మైకెల్ జాక్సన్ 50 ఏళ్ల వయసులో 2009లో మరణించారు. మైకెల్ మరణాంనంతరం కూడా సంపాదిస్తున్నారు. ఈయన అల్బమ్స్ అమ్మినందుకుగాను ఆయా కంపెనీలు ప్రతి ఏటా 115 మిలియన్ డాలర్ల మొత్తాన్ని జాక్సన్‌కు ఇంకా చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం మైకెల్ ఆల్బమ్స్‌ను సోనీ కంపెనీ పబ్లిష్ చేస్తోంది. పాప్ కింగ్ గా పేరు మోసిన జాక్సన్ సంగీత, నృత్యాల్లో, మ్యూజిక్ వీడియోల్లో విప్లవం తెచ్చారు. 1958 ఆగస్టు 29వ తేదీన ఆయన జన్మించారు.

చిన్ననాటి నుంచే పాప్ సింగర్ గా పేరు పొందాడు. తన నలుగురు సోదరులతో కలిసి ఐదుగురితో పాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 1969లో ఈ గ్రూప్ మోటవున్ రికార్‌‌డ్సతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అప్పటి నుంచి మైకెల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జాక్సన్ ఆల్బం ‘థ్రిల్లర్’ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లరుగా రికార్డు సృష్టించింది. జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.
 
ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ
ఎల్విస్ ప్రీస్లీ కూడా మరణాంనంతరం ఏటా 55 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. తను రూపొందించిన ఆల్బమ్స్‌ను పబ్లిష్ చేస్తున్న కంపెనీ ఈ మొత్తాన్ని అందజేస్తుంది. ఎల్విస్ ఆరోన్ ప్రీస్లీ ఒక అమెరికన్ గాయకుడు, నటుడు. 20 వ శతాబ్దంలో అమెరికాలో పేరుగాంచిన ప్రముఖ నటుడు ప్రీస్లీ.  13 ఏళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టాడు. రాక్ అండ్ రోల్, హార్డ్ బ్రేక్ హోటల్ ప్రీస్లీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈయన ఆల్బమ్స్ రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్ల విక్రయాలు జరిపాయి. అతిగా డ్రగ్‌‌స తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయి 42 ఏళ్ల వయసులోనే ప్రీస్లీ మరణించాడు.
 
చార్లెస్ షుల్జ్
ప్రముఖ అమెరికన్ కార్టూనిస్టు చార్లెస్ షుల్జ్. చార్లెస్ మరణాంనతరం కూడా దాదాపు సంవత్సరానికి 40 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఈయన గీసిన కార్టూన్‌లను ప్రచురించే సంస్థ ఈ మొత్తాన్ని చార్లెస్ కుటుంబ సభ్యులకు అందజేస్తోంది.  అనేక స్పూర్తినిచ్చే కార్టూన్‌లను చార్లెస్ గీశాడు. ఈయన రూపొందించిన పీనట్స్ కార్టూన్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలలో 21 భాషల్లో ప్రచురిస్తోంది. అమెరికాలో 3డి-యానిమేటెడ్ సినిమాగా కూడా పీనట్స్ వచ్చింది. 77 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో చార్లస్‌కు పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించాడు.
 
ఎలిజిబెత్ టేలర్
ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజిబెత్ టేలర్. ఈమె నటించిన సినిమాలు ఇప్పటికీ అమ్ముడుపోతున్నాయి. ఇందుకుగాను ఈమెకు ప్రతి ఏటా 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందజేస్తున్నారు. హాలివుడ్ యొక్క స్వర్ణయుగంలో గొప్ప నటీమణుల్లో టేలర్ ఒకరు. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ చారిత్రక నటిమణుల్లో టేలర్‌కు ఏడవ స్థానం కల్పించారు. 1943లో విడుదలైన మెక్డోవల్ చిత్రం టేలర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గుండె సంబంధిత వ్యాధిలో 79 ఏళ్ల వయసులో 2011 సంవత్సరంలో టేలర్ మరణించారు.
 
బాబ్ మెర్లీ
బాబ్ మెర్లీ మరణాంనంతరం కూడా ప్రతి ఏటా దాదాపు 21 మిలియన్ డాలర్లను సంపాదిస్తున్నాడు. మెర్లీ బెవరేజ్ కంపెనీ, హౌజ్ ఆఫ్ మెర్లీ, ఆల్బమ్స్ ద్వారా ఆయన ఈ మొత్తాన్ని పొందుతున్నాడు. మెర్లీ గాయకుడే కాకుండా పాటల రచయిత, గిటారిస్టు, సంగీత దర్శకుడు కూడా. తన ప్రతిభతో అంతర్జాతీయంగా సినీదిగ్గజాల ప్రశంసలు మెర్లీ పొందాడు .ఈయన రూపొందించిన ‘ది వైలర్స్’తో మంచి పేరు సంపాదించుకున్నాడు. వన్ లవ్, కాయా, వెయిటింగ్ ఇన్ వెన్, జామింగ్ ఆల్బమ్స్ ప్రఖ్యాతిగాంచాయి. క్యాన్సర్ బారిన పడి 36 ఏళ్ల వయసులోనే 1981లో మెర్లీ మరణించాడు.

మరిన్ని వార్తలు