అంగారక యాత్రకు టీనేజ్‌ అమ్మాయి!

11 Jul, 2018 16:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నక్షత్రాల వెలుగు జిలుగులతో అందంగా కనిపించే ఆకాశానికేసి చూసినప్పుడు పిల్లలందరికి ‘అబ్బా! అలా రోదసిలోకి వెళ్లి తిరిగొస్తే బాగుండు’ అనిపిస్తుంది. పెద్దయ్యాక వారికి అది అందమైన కలగానే మిగిలిపోతుంది. మన అలిస్సా కార్సన్‌కు అది మిగిలిపోయే కల కాదు. నిజంగా నిజమయ్యే అవకాశాలున్న కల. అమెరికాలోని లూజియానాకు చెందిన అలిస్సా కార్సన్‌ అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు మొదటి మానవ యాత్రకు సిద్ధమవుతుంది. 2033లో అంగారక గ్రహంపైకి మానవ వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఆ యాత్రలో పాల్గొనేందుకు అలిస్సా ఎప్పటి నుంచి నాసాలో శిక్షణ పొందుతోంది. ఆ మాటకొస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాసా నుంచి శిక్షణ తీసుకుంటుందని చెప్పవచ్చు.

పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నాసా అమెరికాలో ఎక్కడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినా అక్కడికెళ్లి హాజరవుతూ వచ్చింది. ఇంతవరకు ఒక్క శిబిరాన్ని కూడా వదల లేదంటే అంతరిక్ష యాత్రలపై ఆమెకున్న మక్కువ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. అలా శిబిరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలతో ఆమె మమేకమైంది. చివరకు వయస్సు రాకముందే నాసా శిక్షణకు హాజరవుతోంది. నాసా నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవడానికి వీల్లేదు. 17 ఏళ్ల అలిస్సా చేర్చుకోవాల్సి వచ్చింది. అందుకనే నాసా ఆమె పేరును, వయస్సును పేర్కొనకుండా ‘బ్లూబెర్రీ’ అనే కోడ్‌ నెంబర్‌తో వ్యవహరిస్తున్నారు.

అంతరిక్ష యాత్ర, ముఖ్యంగా అంగారక యాత్రపై అలిస్సాకు ఇష్టం ఏర్పడడానికి కూడా కారణం ఉంది. ‘బ్యాకీయార్డిగాన్స్‌’ శీర్షికతో నికలడియాన్‌ నడిపిన కార్టూన్‌ సిరీస్‌ను చిన్నప్పుడే చదవడం కారణం. ఆ సిరీస్‌లో ఓ ఎపిసోడ్‌ ‘మిషన్‌ టు మార్స్‌’ ఉంటుంది. అందులో మిత్రులంతా కలిసి ఊహాత్మకమైన అంగారక గ్రహంపైకి వెళతారు. అప్పుడే తాను నిజంగా అంతరిక్ష యాత్రకు వెళ్లాలని అనుకుంది. అందుకు కాస్త పెద్దయ్యాక ఎలాగైనా వ్యోమగామిని కావాలని కలలుకంది. ఇప్పుడు నిజంగానే ఆమెకు అవకాశం వచ్చింది. తాను జీవితంలో టీచర్‌గానీ లేదా దేశాధ్యక్షుగానీ కావాలని కోరుకుంటున్నానని, అయితే అది అంగారక గ్రహంపైకి వెళ్లి వచ్చాక నెరవేరాలనుకుంటున్న లక్ష్యమని ‘టీన్‌ యోగ్‌’కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.

వ్యోమగామికి అవసరమైన ప్రాథమిక శిక్షణను అలిస్సా తీసుకుంటున్నారు. భూమి గురుత్వాకర్షణ లేని శూన్యంలో గడపడం, నీటిలో ఎక్కువ సేపు వివరించడం లాంటి శిక్షణలు తీసుకుంటున్నారు. ఆర్యన్‌ అంతరిక్ష నౌకలో ఆమె అంగారక గ్రహంపైకి వెళ్లనున్నారు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు ఆరు నెలల కాల వ్యవధి పడుతుంది. తాను ఏడాదికి పైగా అంగారక గ్రహంపై గడపనున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి. అసలు నీటి ఛాయలు ఉన్నాయా, జీవి ఉనికికి ఆస్కారం ఉందా? అక్కడ మానవుల మనుగడ సాధ్యమేనా? అంశాలపై తాము అధ్యయనం జరుపుతామని చెప్పారు. అంతరిక్ష యాత్రకు సమాయత్తమవుతున్న అలిస్సా ముందుగా రోదసిలోని అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లి రానుంది. అక్కడికి వెళుతున్న తొలి టీనేజర్‌గా రికార్డు సృష్టించనుంది. అంగారక యాత్రకు శిక్షణ పొందుతున్న తొలి టీనేజర్‌ కూడా అలిస్సానే అయినప్పటికీ ఆమె యాత్రకు బయల్దేరే నాటికి ఆమెకు 32 ఏళ్లు వస్తాయి.

మరిన్ని వార్తలు