రోహింగ్యాలు: జాంబియా బాటలో మాల్దీవులు..

26 Feb, 2020 16:54 IST|Sakshi

రోహింగ్యాల తరఫున వాదించనున్న అమల్‌ క్లూనీ!

మాలే/మాల్దీవులు‌: మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అమల్‌ క్లూనీ రోహింగ్యాల తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. రోహింగ్యాలకు అండగా నిలిచిన మాల్దీవులు ప్రభుత్వం ఈ మేరకు అమల్‌ క్లూనీని సంప్రదించినట్లు పేర్కొంది. మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికంగా రోహింగ్యాలపై దాడులు జరిగాయి.

ఈ క్రమంలో రోహింగ్యాలు వలసబాట పట్టి... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌ ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. రోహింగ్యాలకు మద్దతుగా... పశ్చిమాఫ్రికా దేశం జాంబియా గతేడాది నవంబరులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఊచకోతను ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా కోర్టు మయన్మార్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.(భారత్‌ మా మాతృదేశం అవుతుందను​కున్నాం : రోహింగ్యాలు)

ఈ క్రమంలో తాజాగా మాల్దీవులు సైతం మయన్మార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయం గురించి మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ మాట్లాడుతూ... ‘‘  రోహింగ్యా ప్రజల పట్ల జరుగుతున్న అకృత్యాలకు మయన్మార్‌ జవాబుదారీగా ఉండాలి. రోహింగ్యాలకు రిపబ్లిక్‌ ఆఫ్‌ మాల్దీవులు మద్దతు తెలుపుతోంది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ 14వ సదస్సులో... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమల్‌ క్లూనీని తమ న్యాయవాదిగా నియమించుకున్నట్లు తెలిపారు.

ఇక ఈ విషయంపై స్పందించిన అమల్‌ క్లూనీ.. ‘‘అంతర్జాతీయ న్యాయస్థానంలో మాల్దీవులుకు ప్రాతినిథ్యం వహించాలని నన్ను సంప్రదించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రోహింగ్యాల పట్ల మయన్మార్‌ వ్యవహరించిన తీరుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రోహింగ్యా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా అమల్‌ క్లూనీ గతంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ తరఫున వాదించి.. గెలిచారు. ఆయనకు అన్యాయంగా జైలు శిక్ష విధించారని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్‌ జర్నలిస్టులు వా లోన్‌(32), కా సో ఓ(28)లకు యంగూన్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా.. వారికి అమల్‌ క్లూనీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్‌ తరఫున కూడా అమల్‌ క్లూనీ వాదించారు.(‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా