ఆ పాట.. నా అంత్యక్రియల్లో వినిపించండి!

26 Jan, 2016 16:25 IST|Sakshi
ఆ పాట.. నా అంత్యక్రియల్లో వినిపించండి!

అందాల తార.. అమందా హోల్డెన్... ఇప్పుడో విచిత్ర ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది. తనకు ఇష్టమైన అబ్బా డ్యాన్సింగ్ క్వీన్ సాంగ్ ను తన అంత్య క్రియల సమయంలో ప్లే చేయాలంటూ వేదికపై వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో ఆడిషన్స్ జరుగుతుండగా ఆ పాటను ఎంతో ఉద్వేగంగా పాడిన ఆమె... ఆ తర్వాత అదే సాంగ్ తనను సమాధిలో ఉంచే సమయంలో పాడాలంటూ కోరడం విన్నవారికి విస్మయం కలిగించింది. ఇంతకూ అమందా ఆవేదన వెనుక కారణం ఏమయ్యుంటుంది?

హాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచే అందాల నటిగానే కాక, మంచి సింగర్ గానూ, ప్రెజెంటర్ గానూ పేరుతెచ్చుకున్న 'అమందా లూయిస్ హోల్డెన్'... బ్రిటన్ ఐటీవీ కార్యక్రమం 'బ్రిటన్ గాట్ ట్యాలెంట్' షోలో జడ్జిగా కూడా ప్రత్యేక ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు అదే వేదికపై టాలెంట్ షో ఆడిషన్ కు ముందు తనకు ఎంతో ఇష్టమైన, తాను మొదటిసారి మనసుకు నచ్చి, మెచ్చి పాడుకున్న పాట (అబ్బా డ్యాన్సింగ్ క్వీన్) ఎంతో శ్రావ్యంగా ఆలపించింది. ఇంతలో ఏమైందో ఏమో ''ఇది నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట. నా మనసునుంచి జాలువారిన గీతం. నా మరణానంతరం నన్ను సమాధిలో ఉంచే సమయంలో ఈ పాటను ప్లే చేయండి'' అంటూ అమందా వెల్లడించింది.  కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో సహ జడ్జి సైమన్ కోవెల్ చేసిన సరదా కామెంటే ఆమె అప్రస్తుత ప్రకటన వెనుక కారణమై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు.   

బిజిటి ఆడిషన్స్ సమయంలో సైమన్ కోవెల్... అమందా మాజీ భర్త.. హాస్యనటుడు లెస్ డెన్నిస్ పై చేసిన సరదా కామెంట్.. ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఊహించని ఉద్వేగానికి లోనయ్యింది. అదే సమయంలో డైనోసార్ డ్రెస్ తో డ్యాన్స్ ట్రూప్ స్టేజ్ పైకి రావడం ఆమెకు కలసి వచ్చింది. ఇంకేముందీ... వారికి ఓ పక్క అభినందనలు తెలుపుతూనే ఆ డైనోసార్ నావైపే చూస్తోందని, దాని మోసపూరిత ప్రవర్తన గురించి నాకు ఎప్పుడో తెలుసునని మిస్టర్ నాస్టీగా కూడా దానికి పేరు అందుకే వచ్చిందని ఇలా అనేక వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమయానికి  డెన్నిస్ వేదిక ముందు ఉండటం.. సైమన్ వెక్కిరించడం ఆమెను ఆవేశానికి గురి చేశాయి. ఆమె ప్రవర్తనకు సర్ది చెబుతూ 'లీవ్ లెస్ ఎలోన్' అంటూ డెన్నిస్ ను ఉద్దేశించి సైమన్ అనడం కూడా అమందాను పట్టలేని ఉద్వేగానికి లోను చేశాయి. ఆమె చేతిలో సుమారు ఏభై వేల రూపాయల ఖరీదైన ఫోన్ ను విసిరికొట్టి నాశనం చేయడమే కాక, అక్కడున్న గ్లాసుల్లో నీటిని కూడా సైమన్ పై పోసి నానా హంగామా చేసింది. అమందా ప్రవర్తనపై ఇంతకు ముందే ఓసారి అనుభవం ఉండటంతో ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సైమన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

గతంలో బ్రిటన్ గాట్ మోర్ ట్యాలెంట్ సమయంలో కూడా అమందా ఇలాగే ప్రవర్తించింది. అప్పట్లో అతిథిగా వచ్చిన స్టీఫెన్ ముల్లెన్... అమందాను.. న్యూయార్క్ సామాజిక వేత్త జోస్లిన్ వైల్డెన్ స్టిన్ తో పోలుస్తూ వెక్కిరించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. నట జీవితంలోనూ, సింగర్ గానూ, జడ్జిగానూ ఎంతో  పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమందా వివాహ జీవితం మాత్రం ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నోసార్లు మోసపోవడం కూడా ఆమె కోపం వెనుక కారణాలై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. 1995 లో లెస్ డెన్నిస్ ను వివాహమాడిన అమందా ఎనిమిదేళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో 2003 లో విడిపోయారు. అనంతరం 2008 లో తిరిగి క్రిస్ హూగ్స్ ను పెళ్ళి చేసుకుంది. 44 ఏళ్ళ అమందాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో జడ్జింగ్ ప్యానెల్ లో సైమన్ తో పాటు... అంమందా కూడా జడ్జిగా కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు