మారణాయుధాలను విక్రయిస్తున్న అమెజాన్‌!

15 Mar, 2016 20:04 IST|Sakshi
మారణాయుధాలను విక్రయిస్తున్న అమెజాన్‌!

మారణాయుధాల అమ్మకాలపై ఆంక్షలు ఉండగా.. వాటిని పట్టించుకోకుండా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ విచ్చలవిడిగా కత్తులను అమ్ముతున్నట్టు తేలింది. 18 ఏళ్ల వయస్సు నిండిన వారికి మాత్రమే పలు ఆంక్షలతో కత్తుల వంటి మారణాయుధాలు అమ్మాల్సి ఉంటుంది. కానీ, అమెజాన్‌ మాత్రం బ్రిటన్‌లో ఓ 16 ఏళ్ల బాలుడికి పెద్ద కత్తిని అమ్మింది. మడుచుకోవడానికి వీలుండి.. 8.5 సెంటీమీటర్ల పొడవు బ్లేడ్‌ ఉన్న కత్తిని ఆ బాలుడు 40 పౌండ్లకు అమెజాన్‌లో కొనుగోలు చేశాడు. ఆ కత్తితో స్కూలుకు వెళ్లిన అతను సహచర విద్యార్థిని పొడిచి చంపాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ కేసులో నిందితుడైన బాలుడిపై హత్య అభియోగాలను కోర్టు ఎత్తివేసినప్పటికీ, మృతికి కారణమైన అభియోగాలతో అతన్ని విచారించాలని నిర్ణయించింది.

18 ఏళ్ల లోపు ఉన్నవారికి మూడు అంగుళాల కన్నా పొడవు ఉన్న కత్తిని అమ్మడం బ్రిటన్‌లో చట్టవిరుద్ధం. అయితే ఆ బాలుడు మాత్రం తాను మేజర్ అని పేర్కొంటూ అమెజాన్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. అతని వయస్సు నిర్ధారించుకోకుండానే అమెజాన్‌ అతడికి కత్తిని డెలివరీ చేసింది. తన వయస్సు గురించి ఆరా తీయకుండా ఉండేందుకు ఆ బాలుడు తెలివిగా డెలివరీని ఇక్కడ ఉంచి వెళ్లండి అంటూ తన ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించాడు. డెలవరీ బాయ్‌ అదేవిధంగా చేయడంతో అక్రమంగా కొనుగోలుచేసిన కత్తితో అతడు ఘాతుకానికి ఒడిగట్టాడు. తాజాగా గార్డియన్ పత్రిక తమ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఇంటి చిరునామాతో అమెజాన్‌లో కత్తిని ఆర్డర్ చేసి.. ఆ బాలుడి మాదిరిగా ఆ ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించింది. ఆ లేఖ ప్రకారం కత్తిని డెలివరీ బాయ్ ఆ చిరునామాలో వదిలేసి వెళ్లాడు. దీంతో కత్తుల వంటి మారణాయుధాల అమ్మకాల్లో అమెజాన్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, పిల్లలకు విచ్చలవిడిగా మారణాయుధాలు అమ్ముతున్నదని తాజా ఉదంతం రుజువు చేస్తున్నదని గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు