అమెజాన్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

29 Jun, 2020 17:31 IST|Sakshi

బెర్లిన్ : ప్ర‌ముఖ‌ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌కు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. అమెరికా త‌ర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన జ‌ర్మ‌నీలో అమెజాన్ ఉద్యోగులు నిర‌స‌న‌కు దిగారు. కార్మికుల భ‌ద్ర‌త‌, హ‌క్కుల‌పై పోరాడేందుకు 48 గంట‌ల పాటు జ‌ర్మ‌నీలోని అన్ని కేంద్రాల ఉద్యోగులు స‌మ్మెకు దిగుతున్న‌ట్లు ఉద్యోగ సంఘాలు ఆదివారం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తూనే ఉంది. అమెజాన్ సంస్థ‌లోని పలువురు ఉద్యోగులు సైతం కోవిడ్ బారిన ప‌డ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల‌కు అండ‌గా నిలుస్తూ వారికి ఆర్థి‌క స‌హాయం అందించాల్సిన సంస్థ క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. (‘అధ్యక్షుడిగా వైదొలగినా ట్రంప్‌ను వెంటాడతాం’ )

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ కంపెనీ త‌మ స్వప్ర‌యోజ‌నాల‌కు, లాభాపేక్ష‌కు మాత్ర‌మే ప్రాధ్యానం ఇస్తుందని త‌మ భ‌ద్ర‌త గురించి ఆలోచించ‌డం లేద‌ని ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో 'గుడ్ అండ్ హెల్తీ వ‌ర్క్' అనే నినాదంతో 48 గంట‌ల పాటు స‌మ్మె కొన‌సాగుతుంద‌ని ఉద్యోగ సంఘం ప్ర‌తినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు. జ‌ర్మ‌నీలోని వివిధ కేంద్రాల్లో ప‌నిచేస్తున్న దాదాపు 30-40 మందికి క‌రోనా సోకింద‌ని, అయినా ఇప్ప‌టివ‌ర‌కు వారికి ఎలాంటి ఆర్థిక స‌హాయం అంద‌లేద‌ని చెప్పారు. 

అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్ని అమెజాన్ తోసిపుచ్చింది. ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల భ‌ద్ర‌త దృష్ట్యా సంస్థ .. జూన్ నాటికి సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,227 కోట్లు) పెట్టుబడి పెట్టిందని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే 21 మిలియ‌న్ల  గ్ల‌వుజులు, 18 మిలియ‌న్ల ఫేస్ మాస్కులు స‌హా 39 మిలయ‌న్ల ఇత‌ర  భ‌ద్ర‌తా ప‌రిక‌రాలను అందించామ‌ని జ‌ర్మ‌నీ అమెజాన్ ప్ర‌తినిధి అన్నారు. నిరాదార ఆరోప‌ణ‌లు చేస్తూ సంస్థ‌కు చెడ్డ‌పేరు తేవడం మంచిది కాద‌ని పేర్కొన్నారు. కాగా 2013 నుంచి జ‌ర్మ‌నీలో వేత‌నాలు పెంచాలంటూ ఉద్యోగులు తరుచూ స‌మ్మెల‌కు దిగుతున్నారు. (దోశ ఆకృతిలో క‌నిపిస్తున్న గ్ర‌హం )

మరిన్ని వార్తలు