80 ఏళ్ల మిస్టరీ వీడింది

9 Mar, 2018 15:25 IST|Sakshi

వాషింగ్టన్‌ : దాదాపు 8 దశాబ్దాలకు పైగా నెలకొన్న మిస్టరీకి ఎట్టకేలకు తెర పడింది. అదృశ్యమైన అమెరికన్‌ వైమానికురాలు అమెలియా ఇయర్‌హార్ట్‌ మృతదేహం తాలూకు అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 

పశ్చిమ పసిఫిక్‌ ఐలాండ్‌లో పరిశోధకులు వీటిని గుర్తించగా.. వాటిని పరిశోధించిన టెన్నెస్సె యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్‌ రిచర్డ్‌ జాన్ట్జ్‌ ఇది అమెలియా అవశేషాలనే అని పేర్కొన్నారు. యాత్రికురాలు, రచయిత అయిన అమెలియా 1937లో విమానం ద్వారా ప్రపంచ యాత్రకు బయలుదేరారు. విమానంలో ఆమెతోపాటు నేవిగేటర్‌ ఫ్రెడ్‌ నూనన్‌ కూడా ఉన్నారు. విమానం ఫసిఫిక్‌ సముద్రం మీదుగా వెళ్తుండగా నికూమరోరో ప్రాంతంలో అదృశ్యమైంది.

ఆ తర్వాత రెండేళ్లకు ఆమె జాడ తెలియకపోయేసరికి చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె అదృశ్యం గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈమె జీవిత చరిత్రపై పలు భాషల్లో చిత్రాలు కూడా వచ్చాయి. చివరకు 1940లో ఎముకల గూడు గార్డనర్‌ ఐలాండ్‌కు కొట్టుకొచ్చాయి. అప్పటి నుంచి వాటిపై అంథ్రోపాలజిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మృత దేహ నిర్ధారణ కోసం చేసిన అధ్యయనాల్లో చాలా వరకు గందరగోళ ప్రకటనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరకు శాస్త్రీయంగా మూడు సిద్ధాంతాలను అన్వయించిన రిచర్డ్‌  .. చివరకు అది అమెలియాదే అని తేల్చారు.  ఇంధనం అయిపోవటంతోనే విమానం కూలిపోయి ఉంటుందని.. ఆమె అస్థిపంజరం ద్వీపానికి కొట్టుకొచ్చిందని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రెడ్‌ నూనన్‌ అవశేషాలు మాత్రం ఇప్పటిదాకా లభ్యం కాలేదు.

                                              అమెలియా ఇయర్‌హార్ట్‌  చివరి చిత్రం

మరిన్ని వార్తలు