అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

16 Jul, 2019 20:18 IST|Sakshi

జెనీవా : అణ్వాయుధాల పరిమితిపై నూతన ఒప్పందం కుదుర్చుకోవడానికి రష్యా, అమెరికాలు బుధవారం జెనీవాలో సమావేశం కానున్నాయి. ఈ ఒప్పందంలో భాగస్వామ్యులు కావాలంటూ అమెరికా చైనాను సైతం  కోరింది. ‘అన్ని రకాల అణ్వాయుధాలను పరిమితం చేయడానికి రష్యా,  చైనాలతో ‘తదుపరి తరం’ ఆయుధ నియంత్రణ ఒప్పందాన్ని చూడాలనుకుంటున్నాను’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఒసాకాలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో ట్రంప్‌ ఈ అంశాన్ని వ్యక్తిగతంగా చర్చించారు. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి బీజింగ్ ఎంతవరకు సిద్ధంగా ఉంటుందో స్పష్టంగా తెలియదని ఆనాడే అమెరికా అధికారులు వెల్లడించారు. ‘ఈ చర్చల్లో చైనా పాల్గొనడానికి ముందస్తు షరతులను ఒప్పుకోం’ అని చైనా కూడా సమాధానం ఇచ్చింది. అయితే ఈ ఒప్పందంపై మాకు ఆసక్తి లేదని  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వ్యాఖ్యానించింది. దీంతో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంపై రష్యా, అమెరికాలు మాత్రమే చర్చలకు సిద్ధమయ్యాయి. 

క్షీణించిన సంబంధాలు
అమెరికా, రష్యాల సంబంధాలు మెదటినుంచి ఒకదానిపై ఒకటి యుద్ధప్రేరేపిత సంబంధాలే. అయితే 1991లో యుఎస్‌ఎస్‌ఆర్‌ కుప్పకూలి అమెరికా అగ్రరాజ్యంగా ఏకధృవప్రపంచం ఏర్పడినా సైనిక రంగంలో రష్యా ఇంకా అగ్రరాజ్యమే. దీంతో ఇరుదేశాలు అంతర్జాతీయంగా అనేక అంశాలలో విభేదించుకున్నాయి. ముఖ్యంగా 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడం, సిరియా యుద్ధంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు రష్యా మద్దతు ఇవ్వడంతో వీటి మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అలాగే అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందంటూ విచారణలు, బ్రిటిష్ గడ్డపై మాజీ గూఢచారిని, అతని కుమార్తెను రష్యా విషం ఇచ్చి చంపిందనే ఆరోపణలు కూడా తోడవడంతో వీటి మధ్య సంబంధాలు ఇంకా క్షీణించాయి.  ఉక్రేనియన్ నావికాదళ పడవలు, సిబ్బందిని, అలాగే యుఎస్ పౌరులను రష్యా నిర్బంధించడం వంటి ఇతర సంఘటనలపై కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  

చర్చలు ఫలిస్తాయా?
ప్రచ్చన్న యుద్ధకాలంనాటి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్న విషయం తెలిసిందే. స్వల్పశ్రేణి, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేయకూడదంటూ రష్యా, అమెరికాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంతో రష్యా భయం యూరప్‌కు తొలగింది. అయితే ట్రంప్‌ వచ్చాక పరిస్థితి మారింది. యూరప్‌ భద్రత యూరపే చూసుకోవాలంటూ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో రష్యా తిరిగి మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తుందేమోనని భయం యూరప్‌కు పట్టుకుంది. పైగా మాస్కో యూరప్‌లోని ఏ ప్రాంతంపైన దాడిచేయాలన్నా క్షణాల్లో ఏర్పాట్లు చేసుకునేంతగా సామర్థ్యం కలిగి ఉందని యుఎస్‌ అధికారులు హెచ్చరించారు. ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. ఈ సమావేశంలో ఐఎన్ఎఫ్ ఒప్పందం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో రష్యా, అమెరికాల మధ్య చర్చలు ఫలవంతంగా నడుస్తాయా?.. ట్రంప్‌ ఉండగా ఇది సాధ్యమేనా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు