కొరియన్‌ పెనిన్సులాపై అమెరికా విమానాల చక్కర్లు

8 Jul, 2017 19:39 IST|Sakshi
కొరియన్‌ పెనిన్సులాపై అమెరికా విమానాల చక్కర్లు

సియోల్‌: ఖండాంతర క్షిపణి ప్రయోగంతో అమెరికాను చేరగలిగే క్షిపణిని తయారు చేసిన ఉత్తరకొరియాకు ధీటుగా బదులిచ్చేందుకు అమెరికా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యక్ష ఫైర్‌ డ్రిల్‌ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియాకు అతి సమీపంగా వెళ్లిన యుద్ధవిమానాలు కొరియన్‌ పెనిన్సులాపై కాసేపు చక్కర్లు కొట్టాయి.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలకు కఠిన సమాధానం చెప్పేందుకే ఈ డ్రిల్‌ చేపట్టినట్లు దక్షిణకొరియా మిలటరీ పేర్కొంది. దక్షిణ కొరియాలోని గువామ్‌లో గల అండర్సన్‌ ఎయిర్‌బేస్‌లో నాలుగు అమెరికా యుద్ధవిమానాలు, ఒక దక్షిణకొరియా జెట్‌ ఫైటర్‌ శనివారం ప్రత్యక్ష ఫైర్‌ డ్రిల్‌ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియా సరిహద్దుకు అతి సమీపానికి వెళ్లిన విమానాలు కొరియన్‌ పెనిన్సులాపై చక్కర్లు కొట్టి తిరిగి ఎయిర్‌బేస్‌ను చేరుకున్నాయి.

గత మంగళవారం ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. అత్యంత సామర్థ్యం గల ఈ క్షిపణి తూర్పు సముద్రంలో  జపాన్‌ ప్రత్యేక ఆర్థిక మండలిలో పడింది. ఈ క్షిపణికి అమెరికాలోని అలస్కాను చేరే సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. కాగా.. దీనిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

>
మరిన్ని వార్తలు