వామ్మో.. పదకొండు వేల కోట్ల లాటరీ ఒక్కరికే!!

24 Oct, 2018 20:37 IST|Sakshi
లాటరీ టిక్కెట్లు కొంటున్న అమెరికన్లు

వాషింగ్టన్‌: లాటరీలో అదృష్టం వరించిన వారి గురించి వార్తలు నిత్యం చూస్తుంటాం. కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ లాటరీ అమెరికాలో ఎవరినో వరించింది. విచిత్రం ఏమిటంటే ఈ లాటరీ ఎవరికి తగిలిందో ఇప్పటివరకు తెలియదు. ఎప్పటికీ తెలియకపోవచ్చు. దక్షిణ కరోలినాకు చెందిన వారికి 1.6 బిలియన్‌ డాలర్ల ‌(సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు) జాక్‌పాట్‌ తగిలిందని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన మెగా బాల్‌ డ్రాలో దక్షిణ కరోలినాలో కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ దక్కిందని మెగా మిలియన్‌ నిర్వాహకులు తెలిపారు. టికెట్‌లోని ఆరు నంబర్లు.. డ్రా తీసిన అంకెలతో సరిగ్గా సరిపోయాయని ప్రకటించారు. అయితే లక్ష కోట్ల రూపాయలు గెల్చుకున్నదెవరో ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు!

సింగిల్‌ టికెట్‌.. జాక్‌పాట్‌
ఒక్క లాటరీ టిక్కెట్‌కు 1.6 బిలియన్‌ డాలర్ల లాటరీ దక్కడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. మంగళవారం రాత్రి  నిర్వహించిన డ్రాలో 5, 28, 62, 65, 70, 5 నంబర్లకు బిలియన్‌ మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌ తగిలింది. ప్రపంచంలో ఒక టిక్కెట్‌కు ఇంత మొత్తం ఏ లాటరీలోనూ లేదు. అయితే బుధవారం ఉదయం జాక్‌పాట్‌ మొత్తాన్ని 1.54 బిలియన్‌ డాలర్లుగా సవరించారు. దీంతో అమెరికా లాటరీలో రెండో అతిపెద్ద జాక్‌పాట్‌గా నిలిచింది. 2016లో ముగ్గురు 1.56 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని గెల్చుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన డ్రాలో ఒక్కరే 1.54 బిలియన్‌ డాలర్లు గెల్చుకోవడం విశేషం.


లాటరీ టిక్కెట్ల కోసం క్యూ కట్టిన ఆశావహులు

ఎనిమిది రాష్ట్రాలకు జాక్‌పాట్‌
దక్షిణ కరోలినాతో పాటు డెలావర్‌, జార్జియా, కాన్సాస్‌, మేరీల్యాండ్‌, ఉత్తర డకోటా, ఒహియో, టెక్సాస్‌ రాష్ట్రాల్లోని వారికి కూడా లాటరీ తగిలింది. వాషింగ్టన్‌ డీసీ, వర్జిన్‌ ఐలాండ్‌తో పాటు 44 రాష్ట్రాల్లో ఈ లాటరీ నిర్వహిస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌కు రెండు డాలర్లు వెచ్చించి ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే విజేతలు ఎవరనేది అత్యంత గోప్యంగా ఉంచుతారు. బిలియన్‌ మెగా మిలియన్స్ మొత్తాన్ని 29 ఏళ్లలో ఏడాదికి కొంత చొప్పున చెల్లించే అవకాశం కూడా ఉంది. అయితే ఎక్కువ మంది ఒకేసారి డబ్బు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు.

చెప్పలేనంత ఉద్వేగం..
‘మేం ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. అమెరికా లాటరీ చరిత్రలో ఇది నిజంగా చారిత్రక సందర్భం. చెప్పలేనంత ఉద్వేగం ఉంది. ఒక్కరే బిలియన్‌ డాలర్ల లాటరీ సొంతం చేసుకోవడం చాలా సంతోషం. విజేతను కలుసుకునేందుకు సౌత్‌ కరోలినా ఎడ్యుకేషన్‌ లాటరీ నిర్వాహకులు ఆత్రుతగా ఎదురు చేస్తున్నార’ని మెగా మిలియన్స్‌ గ్రూపు ప్రధాన డైరెక్టర్‌ గొర్డన్‌ మెడినికా పేర్కొన్నారు. మల్టీ-స్టేట్‌ లాటరీ అసోసియేషన్‌, ఇతర సంఘాల సమన్వయంతో మెగా మిలియన్స్‌ గ్రూపు ఈ భారీ లాటరీ నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు