‘అమెరికా ఫస్ట్‌’ అంటే..!

27 Jan, 2018 01:53 IST|Sakshi
దావోస్‌లో ప్రసంగిస్తున్న ట్రంప్‌

‘అమెరికా మాత్రమే అని అర్థం కాదు

న్యాయబద్ధ స్వేచ్ఛావాణిజ్యానికి నా మద్దతుంటుంది

ప్రొటెక్షనిజంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వివరణ

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో ప్రసంగం

దావోస్‌: ‘అమెరికా ఫస్ట్‌(తొలుత అమెరికా)’ అనే తన నినాదాన్ని ‘అమెరికా మాత్రమే’ అనే అర్థంలో చూడకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. అమెరికా సాధించిన అభివృద్ధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. అయితే, తన తొలి ప్రాధాన్యత అమెరికానేనని పునరుద్ఘాటించారు.

‘అమెరికా ఫస్ట్‌ అంటే అమెరికా మాత్రమే అని కాదు.  అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచమూ వృద్ధి చెందుతుంది’ అని అన్నారు. దావోస్‌ వేదికగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన దావోస్‌లో కీలక ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై అమెరికా పోరు కొనసాగిస్తుందని, అఫ్గానిస్తాన్‌ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారనివ్వబోమన్నారు.  

పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నాం..
ఏడాది కాలంగా తాను తీసుకున్న నిర్ణయాల్ని  ట్రంప్‌ ప్రస్తావించారు. ‘వరుసగా స్టాక్‌ మార్కెట్‌ రికార్డులు బద్దలవుతున్నాయి. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి ఇంతవరకూ అదనంగా 7 ట్రిలియన్‌ డాలర్లు మార్కెట్లలోకి వచ్చి చేరాయి. స్వేచ్ఛా వాణిజ్యానికి అమెరికా మరోసారి సిద్ధమని చెప్పేందుకు నేనిక్కడి వచ్చా. అమెరికాలో వ్యాపారానికి, ఉద్యోగాలకు, పెట్టుబడులకు ఇదే మంచి సమయం. నేనెప్పుడూ అమెరికా ఫస్ట్‌ విధానాన్ని నమ్ముతాను. ప్రపంచ నేతలు కూడా వారి దేశం విషయంలో అలాగే భావించాలి. అధ్యక్షుడిగా దేశం, ఉద్యోగులు, కంపెనీల ప్రయోజనాల్ని ఎల్లప్పుడూ పరిరక్షించాల్సి ఉందన్నారు. ఏదైనా ఒక దేశం నిబంధనల్ని ఉల్లంఘిస్తే స్వేచ్ఛా వాణిజ్య విధానం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.  

మీడియా రూపం అప్పుడు తెలిసింది
ఉగ్రవాదం విషయంలో అమెరికా పౌరుల్ని, సరిహద్దుల్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలకు వెనకాడమని ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘దుర్మార్గపు పాలన, ఉగ్రవాదం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మిత్రదేశాలు తమ భద్రతను పటిష్టం చేసుకోవాలి’ అని సూచించారు. అమెరికాలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సందర్భంలో రెండు పాత చట్టాల్ని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. ‘అమెరికాలోని మధ్య తరగతి ప్రజల కోసం భారీగా పన్నులు తగ్గించాం. కార్పొరేట్‌ వర్గాలకు కూడా ఊరట కల్పించాం.

పన్ను తగ్గింపుతో ఒక కుటుంబ వార్షిక ఆదాయం 4 వేల డాలర్లు పెరుగుతుంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ స్వయం సమృద్ధి, ఇంధన భద్రత కోసం ఇంధన ఉత్పత్తిపై విధించిన కట్టుబాట్లను ఎత్తివేస్తున్నామని అన్నారు. వ్యాపారవేత్తగా ఉన్నప్పుడూ మీడియా ఎప్పుడూ తనను ప్రేమించేదని, అయితే మీడియా ఎంత మోసపూరితమో రాజకీయాల్లోకి వచ్చాక, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకే తెలుసుకోగలిగానని ట్రంప్‌ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో బిల్‌ క్లింటన్‌ అనంతరం దావోస్‌కు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. 

సెనెట్‌లో హెచ్‌–1బీ వీసాల పెంపు బిల్లు
వాషింగ్టన్‌: ప్రతిభావంతులకు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించేలా హెచ్‌–1బీ వీసా వార్షిక  కేటాయింపుల్ని పెంచాలని ప్రతిపాదిస్తూ అమెరికన్‌ సెనెట్‌లో ఇద్దరు రిపబ్లికన్లు సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. ‘ హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు వర్క్‌ పర్మిట్లు ఇవ్వాలని, హెచ్‌1–బీ వీసాదారులు ఉద్యోగాలు మారేందుకు సమయం కేటాయించాలని ప్రతిపాదించారు.

వీసాల వార్షిక పరిమితిని 85 వేలకు పెంచాలని, అవసరమైతే 1.95 లక్షలకు పెంచాలని సూచించారు. కాగా, నిపుణులైన ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు వీసా లాటరీ విధానానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్‌ వీసా పథకంలో ఏడాదికి 50 వేల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తున్నారు. ఈ విధానం అమెరికా భవిష్యత్తుకు లాభదాయకం కాదని ట్రంప్‌ వాదిస్తున్నారు.   

మరిన్ని వార్తలు