'మాతో పెట్టుకోవద్దు.. మీకంత సీన్ లేదు'

15 Sep, 2017 08:13 IST|Sakshi
'మాతో పెట్టుకోవద్దు.. మీకంత సీన్ లేదు'

వాషింగ్టన్: ఓ వైపు ఉత్తరకొరియా వరుస క్షిపణి ప్రయోగాలతో షాకుల మీద షాకులిస్తుంటే మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కిమ్ జోంగ్ ఉన్‌కు ముకుతాడు ఎలా వేయాలన్న దానిపై దృష్టిసారించింది. అమెరికా మీడియా మాత్రం ఉత్తరకొరియా చేష్టలపై భగ్గుమంటోంది. అపారమైన తెలివివేటలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ద్వారానే తమ దేశ అభివృద్ధి సాధ్యమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. నార్త్‌కొరియా లాంటి దేశాలు తమ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తే సత్ఫలితాలు వస్తాయని.. అమెరికాపై దాడులు చేస్తామంటూ కలలు కంటూ కూర్చుంటే కిమ్ జోంగ్ ఉన్ సాధించేం ఉండదని హితవు పలికింది.

అమెరికాను ఎదుర్కొంటున్నానన్న భ్రమలో కిమ్ ఉన్నారని, గతంలో అమెరికాతో పెట్టుకున్న నేతలు సద్దాం హుస్సేన్, గడాఫీ లాంటి వారికి పట్టిన గతే కిమ్‌కు పడుతుందని అమెరికా మీడియా అభిప్రాయపడింది. ఒక్క హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరిపి ఏదో సాధించామని నార్త్‌కొరియా భావిస్తోంది, కానీ అమెరికా వద్ద ఉన్న హైడ్రోజన్ బాంబులతో పోల్చితే ఉత్తరకొరియా అణ్వస్త్రాలు అసలు లెక్కలోకే రావని వెల్లడించింది. గతంలో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రాతిపదికగా తీసుకుని కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై పగ పెంచుకున్నారని, దాంతో క్షిపణి ప్రయోగాలతో యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లు అభిప్రాయపడింది.

ఉత్తరకొరియా నేడు మరో క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించింది. జపాన్‌ మీదుగా ప్రయాణించిన ఆ క్షిపణి పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయినట్లు సమాచారం. ప్యాంగ్‌ యాంగ్‌ నుంచి ఈ శక్తివంతమైన బాలిస్టిక్‌ మిస్సైల్‌ను జపాన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించింది. ఈ చర్యను జపాన్‌ ప్రధాని షింజో అబే తీవ్రంగా ఖండించారు. కిమ్ జోంగ్ ఉన్ తలపెడుతున్న క్షిపణి పరీక్షలకు భయపడేది లేదని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు