భారత్‌​కు మరోసారి షాకిచ్చిన అమెరికా

30 Jun, 2018 12:09 IST|Sakshi
అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌ : భారత్‌, అమెరికా మధ్య జరగాల్సిన అత్యంత కీలక సమావేశాన్ని (2+2 చర్చలు) అమెరికా ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య జులై 6న జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను అనివార్య  కారణాలతో మరోమారు వాయిదా వేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సుష్మా స్వరాజ్‌కు ఫోన్‌లో తెలియజేశారు. కాగా ప్రస్తుతం అదే రోజున(జూలై 6) పాంపియో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం ప్రకారం... వచ్చే నెల(జూలై) 6న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. తద్వారా ఉత్తర కొరియాలో పర్యటించనున్న మొదటి అమెరికా మంత్రిగా ఆయన ఘనత సాధించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటనలో భాగంగా అణునిరాయుధీకరణ అంశంలో పురోగతి సాధించేందుకు కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.  

పాంపియో ఉత్తర కొరియా పర్యటన ద్వారా భారత్‌ కంటే ఉత్తర కొరియాకే అమెరికా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోందంటూ అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడం, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకం పెంచడం, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వంటి అంశాలు జీర్ణించుకోలేకే ట్రంప్‌ సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ వారు అభిప్రాయ పడుతున్నారు.

కాగా అణునిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య ఈనెల(జూన్‌) 12న జరిగిన చరిత్రాత్మక భేటీ విజయవంతమైన విషయం తెలిసిందే. అమెరికా ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా తమ దేశ భద్రతకు అమెరికా నుంచి కిమ్‌ హామీ పొందారు. అమెరికాతో గత వైరాన్ని పక్కనపెట్టి ముందుకు సాగుతామని, ప్రపంచం ఒక గొప్ప మార్పును చూడబోతుందని కిమ్‌ చెప్పారు. ప్రస్తుతం ఆ దిశగా పురోగతి సాధించేందుకే పాంపియో ఉత్తర కొరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు