ఇవిగో..ఉగ్రవాద సంస్థలు!

2 Nov, 2017 21:16 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్, అఫ్గానిస్థాన్‌లో విధ్వంసమే లక్ష్యంగా, పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 20 ఉగ్రవాద సంస్థల వివరాలను అమెరికా విడుదల చేసింది. పాక్‌కు పంపిన జాబితాలో హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హెచ్‌యూఎం వంటి సంస్థల పేర్లు ఉన్నాయి. హక్కానీ గిరిజన ప్రాంతాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ అఫ్గన్‌పై తరచూ దాడులు చేస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలను అగ్రరాజ్యం మూడు వర్గాలుగా విభజించింది.

‘అఫ్గన్‌లో దాడులు చేసేవి, పాక్‌లోనే విధ్వంసం సృష్టించేవి, కశ్మీర్‌ లక్ష్యంగా దాడులు చేసేవి’గా విడదీశారు. వీటిలో హర్కతుల్‌ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా భారత్‌ లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నాయని అమెరికా తెలిపింది. జైషే మహ్మద్‌ కశ్మీర్‌లో హింసకు అధిక ప్రాధాన్యమిస్తోంది. లష్కరే దక్షిణాసియాలోనే ప్రమాదకర ఉగ్రవాద సంస్థ అని ఐరాస సైతం గుర్తించింది. దీనిని 1987 హఫీజ్‌ సయీద్‌ మరికొందరితో సాయంతో ఏర్పాటు చేశారు. లష్కరే భారత పార్లమెంటు, ముంబైపై దాడులు చేసి బీభత్సం సృష్టించింది. పాక్‌లోనూ ఇది వందలాది మందిని చంపుతోందని అమెరికా ఆరోపించింది. మరో ఉగ్రవాద సంస్థ తెహ్రీకీ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) వివిధ మిలిటెంట్‌ గ్రూపుల కలయికతో ఏర్పడింది. ఇది ఇప్పుడు అఫ్గన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నా, గతంలో పాక్‌లో ఎన్నో దాడులు చేసింది. ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగమంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ ఇటీవల పాక్‌లో పర్యటించినప్పుడు 75 మంది ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితాను ఇక్కడి ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది. ఉగ్రవాద సంస్థల ఉనికిని నిరూపించే ఆధారాలు చూపితే వాటిపై చర్యలకు పాక్‌ సిద్ధంగా ఉందని ఆయన అమెరికా సెనేట్‌ కమిటీకి తెలిపారు. 

మరిన్ని వార్తలు