తెల్లని కిరీటం ధరించిన వృద్ధుడే.. ఆ తెగ నాయకుడేమో!?

30 Nov, 2018 12:36 IST|Sakshi

అలెన్‌ చౌ డైరీలో సెంటినలీస్‌లకు సంబంధించిన ఆసక్తికర అంశాలు

ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వృద్ధులు దీవికి మరోవైపు ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు ఉన్నట్లుగా కూడా గమనించాను. వాళ్లు గాల్లోకి చేతులు లేపారంటే హాని చేయరని అర్థం- హత్యకు ముందు అలెన్ డైరీలో నోటు చేసుకున్న వివరాలు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నివసించే సెంటినలీస్‌ తెగ ప్రజల చేతిలో  జాన్‌ అలెన్‌ చౌ అనే అమెరికా టూరిస్టు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే దాదాపు పన్నెండేళ్ల తర్వాత సెంటినలీస్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో తమకు ఎదురైన అనుభవాల ఆధారంగా అతడి మృతదేహం లభించే అవకాశమే లేదని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలెన్‌ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు అలెన్‌ డైరీలో రాసుకున్న వివరాల ఆధారంగా అతడి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చే సాధ్యాఅసాధ్యాలను అండమాన్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. (‘వాళ్లు మమ్మల్ని స్వాగతించారు... అంత క్రూరులేం కాదు’ )

అలెన్‌ డైరీ, అతడికి పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్‌ చెప్పిన వివరాల ఆధారంగా..
అలెన్‌ నవంబరు 15న సెంటినల్‌ దీవిలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత సెంటినలీస్‌ల నాయకుడిని కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెల్లని కిరీటం ధరించిన ఓ వృద్ధుడిని ఆ తెగ నాయకుడిగా అలెన్‌ భావించాడు. అతడిని చూడగానే ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో మరికొంత మంది సెంటినలీస్‌లు (వారిలో ఆడవాళ్లు కూడా ఉన్నారు)పరిగెత్తుకు వచ్చారు.  అలెన్‌ వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆ గుంపులో ఉన్న ఓ పదేళ్ల కుర్రాడు అతడిపై బాణం విసిరాడు. అయితే అది అలెన్‌ చేతిలో ఉన్న బైబిల్‌కు గుచ్చుకోవడంతో తొలుత ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులు అతడిపై బాణాలతో విరుచుకుపడటంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. (అతడి శవం దొరికే అవకాశమే లేదా?!)

గాల్లోకి చేతులు లేపారంటే..
‘ఒక్కో గుడిసెలో సుమారు 10 మంది నివసిస్తారు. నా అంచనా ప్రకారం వీరి జనాభా 250 వరకు ఉండొచ్చు. నేను గమనించిన దాన్ని బట్టి అక్కడ ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. బహుశా వృద్ధులు దీవికి మరోవైపు ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు ఉన్నట్లుగా కూడా గమనించాను. సెంటినలీస్‌ గాల్లోకి చేతులు లేపారంటే మనకి హాని చేయరని అర్థం. విల్లంబులు సిద్ధం చేస్తున్నారంటే మాత్రం వేటాడం కోసం సిద్ధమైపోయారనేదానికి సంకేతం. ఎవరు చెప్పినా వాళ్ల ప్రయత్నాన్ని విరమించుకోరని అర్థం. వాళ్లు గట్టిగా అరుస్తారు. ఆ శబ్దాల్లో ఎక్కువగా బీ, పీ, ఎల్‌, ఎస్‌ అక్షరాలతో మొదలయ్యే అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్న బాణాల ఆధారంగా.. వాటిని లోహంతో తయారు చేశారని గుర్తించా. ముఖ్యంగా పడవల తయారీలో ఉపయోగించే లోహాలు అవి. అంటే దీవిలో ఉన్న పాత పడవల నుంచి కొన్ని భాగాలు వేరు చేసి బాణాలు తయారుచేసుకున్నారేమో’ అని సెంటినలీస్‌లను ప్రత్యక్షంగా కలిసే ముందు అలెన్‌ తన డైరీలో రాసుకొచ్చాడు.

కాగా అలెన్‌ డైరీలో లభించిన వివరాలు, గతంలో అక్కడికి వెళ్లి వచ్చిన వారి అనుభవాల ఆధారంగా అతడి మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చేందుకు అండమాన్‌ పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది గిరిజన శాస్త్రవేత్తలు, గిరిజన సంక్షేమ అధికారులు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు విరమించుకుంటేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. సెంటినలీస్‌ల ప్రశాంతకు భంగం కలిగించి, వారి జీవితాల్లో జోక్యం చేసుకోకపోవడమే అందరికీ శ్రేయస్కరమని గిరిజన హక్కుల నేతలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు