చేయని తప్పునకు 31ఏళ్ల జైలు..!

22 Dec, 2016 12:28 IST|Sakshi
చేయని తప్పునకు 31ఏళ్ల జైలు..!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏ తప్పు చేయకున్నా ఓ కేసులో శిక్ష అనుభవించాడు. అది కూడా ఒకటి, రెండు కాదు ఏకంగా 31 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. అత్యాచారం, చోరీ కేసుల్లో అతడు దోషి అని తేల్చిన అమెరికన్ కోర్టు 1977లో అతడికి శిక్ష విధించింది. 2008లో చేపట్టిన విచారణలో నిర్దోషిగా తేలడంతో అతడిని విడుదల చేశారు. తనకు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు పరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలుచేశాడు. అయితే తనకు దక్కింది మాత్రం కేవలం 75 అమెరికా డాలర్లు మాత్రమేనని, తనకు ఇప్పుడూ కూడా అన్యాయమే జరుగుతుందంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు.

అసలు విషయం ఏంటంటే.. టెన్నిస్సె రాష్ట్రానికి చెందిన లారెన్స్ మికిన్నేకి అప్పుడు 22 ఏళ్లు. అందరిలా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన లారెన్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. 1977లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ మరుసటి ఏడాది రేప్, చోరీ కేసులలో దోషీగా తేల్చిన కోర్టు 115 ఏళ్లు జైలుశిక్ష విధించింది. 2008లో డీఎన్‌ఏ టెస్టులు జరిపి లారెన్స్ నిర్దోషి అని తేల్చిన అధికారులు అతడ్ని విడుదల చేశారు. ఆ సమయంలో అతడికి 75 డాలర్ల చెక్ ఇచ్చారు. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేనందున ఆ చెక్‌ను నగదు రూపంలో మార్చుకోవడానికి తనకు మూడు నెలల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తంచేశాడు. కొన్ని రోజులకు 1 మిలియన్ అమెరికా డాలర్ల పరిహారం ఇప్పించాలని పిటిషన్ దాఖలుచేశాడు.

'సగం కంటె ఎక్కువ జీవితాన్ని జైలులోనే మగ్గిపోయాను. అది కూడా ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవించాను. నాకు జరిగిన అన్యాయంపై స్పందించి, తక్షణమే న్యాయం చేయాలని మాత్రమే అడుగుతున్నాను. ఏ తప్పు చేయనందున నాకు పరిహారం ఇప్పించాలి. అప్పుడెలాగో న్యాయం జరగలేదు. ఇప్పుడూ అన్యాయమే జరగుతుంది' అని బాధితుడు లారెన్స్ మెకిన్నే వాపోయాడు. 

మరిన్ని వార్తలు