మెక్సికో సరిహద్దుకు భారీగా అమెరికన్‌ దళాలు

30 Oct, 2018 21:27 IST|Sakshi

వలసలపై విరుచుకుపడుతోన్న ట్రంప్‌

మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకే

వలసల విషయంలో మరింత కఠిన వైఖరి అవలంభించాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. మెక్సికో సరిహద్దు భద్రతలో చురుకైన పాత్ర పోషించేందుకు మిలటరీ హెలికాప్టర్లు సహా  5,200కు పైగా దళాలను పంపనున్నట్టు సోమవారం ప్రకటించింది. నవంబరు 6న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో – తన మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ట్రంప్‌ ‘అక్రమ వలస’ల అంశాన్ని అతి పెద్ద ఎజెండాగా మలచుకున్నారు. సరిహద్దుల భద్రతనే దేశ భద్రతగా స్పష్టీకరించారు.  అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ దీన్నొక రాజకీయ స్టంటుగా వ్యాఖ్యానించింది. 

రిపబ్లికన్లు సెనేట్‌పై పట్టు కోల్పోయినట్టయితే.. అధికారంలో వుండే మిగిలిన రెండేళ్లలో తన విధానాలు కొనసాగించడం ట్రంప్‌కు కష్టమే. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన  అక్రమ వలసపై విరుచుకుపడుతున్నారు. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – 75శాతం రిపబ్లికన్‌ ఓటర్లు అక్రమ వలసలను అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. (డెమోక్రాటిక్‌ పార్టీ ఓటర్లలో ఇలా భావించే వారు 19 శాతం) 
వలసదార్లను తిప్పికొట్టే విషయంలో మిలటరీ తనదైన ప్రత్యేక పాత్ర పోషించబోతున్నట్టు ట్రంప్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దక్షిణ సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించబోతున్న సమూహాల్లో – కొందరు దుష్టులు, అనేక  ముఠాలవాళ్లు వున్నారన్న ట్రంప్‌.. వలసదార్లు తరలిరావడాన్ని దేశంపై జరుగుతున్న దండయాత్రగా అభివర్ణించారు. శరణుకోరి వచ్చే వారి కోసం టెంట్‌ సిటీలు నిర్మిస్తామని, మిలియన్‌ డాలర్లు ఖర్చుబెట్టి ఎలాంటి నిర్మాణాలూ  చేపట్టబోమని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆయన పేర్కొన్నారు. సరిహద్దు గుండా దేశంలో ప్రవేశించే వలసదార్లపై ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌ను ప్రయోగించడంపై కూడా ట్రంప్‌ సర్కారు పరిశీలన జరుపుతోంది. జాతీయ భద్రతా కారణాలపై కొందరు వలసదార్లకు ఆశ్రయమివ్వకుండా తిరస్కరించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. 

మెక్సికోకు బెదిరింపులు
గ్వాటిమాలా, హోండురాస్, ఎల్‌ సాల్విడార్‌ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి ప్రవేశించజూస్తున్న వలసదార్లను ఆ దేశం గనుక అడ్డుకోనట్టయితే, సరిహద్దులోకి మిలటరీని తరలిస్తామని, దక్షణ సరిహద్దును మూసివేస్తామని ఇటీవలే ట్రంప్‌ ప్రకటించారు. వలసదార్లను అడ్డుకోనట్టయితే పెండింగ్‌లో వున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి మళ్లుతామని కూడా ఆయన బెదిరించారు. ఈ నేపథ్యంలో వలసదార్లను అడ్డుకునేందుకు.. మెక్సికో అధ్యక్షుడు ఎన్‌రిక్‌ పెనా నిటో భారీగా పోలీసులను రంగంలోకి దించారు. గత వారం  వలసదార్ల ముందు ఒక ఒప్పంద ప్రతిపాదన కూడా చేశారు. మెక్సికో దక్షిణాది రాష్ట్రాలైన ఓక్సాకా,  చిపాస్‌లో వుండేట్టయితే.. వారికి తాత్కాలిక వర్క్‌ పరిమిట్లు ఇస్తామని, పాఠశాలల్లో చేరేందుకు, వైద్య సాయం పొందేందుకు వీలు కల్పిస్తామని ప్రకటించారు. అత్యధిక వలసదార్లు దీన్ని కొట్టిపడేశారు. అమెరికా సరిహద్దులోకి వెళ్లేందుకే వారు మొగ్గు చూపారు. 

శరణార్ధుల సుదీర్ఘ యాత్ర..
అమెరికాలోకి ప్రవేశించేందుకు హోండురాస్‌లోని శాన్‌ పెడ్రో సులా నుంచి 15 రోజుల కిందట బయలుదేరిన 3000 నుంచి 7000 మంది శరణార్ధులు  600 మైళ్లు దాటినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించాలంటే వీరు ఇంకా 2,200 మైళ్లు ప్రయాణించాల్సివుంది. అమెరికానే తమకు ఆశావహమైన దేశమనీ, అక్కడే సురక్షితంగా వుండగలమనీ భావిస్తున్న ఈ శరణార్ధులు – ఉత్సాహం తెచ్చుకునేందుకు పాటలు పాడుకుంటూ.. నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
 

మరిన్ని వార్తలు