క‌రోనా: అభిమానుల‌కు అండ‌గా నిలిచిన పాప్ సింగ‌ర్

27 Mar, 2020 09:57 IST|Sakshi

వాషింగ్ట‌న్‌ : అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అరియానా గ్రాండే త‌న అభిమానుల‌కు అండగా నిలిచారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప‌లు దేశాల్లో లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీలు లేక‌పోవ‌డంతో అనేక మంది త‌మ‌ ఉపాధిని కోల్పోయారు. ఈ క్ర‌మంలో ఉపాధి కోల్పోయిన‌ త‌న అభిమానులకు సాయం చేయ‌డానికి అరియానా ముందుకు వ‌చ్చారు. క‌ష్ట స‌మ‌యంలో అభిమానుల‌కు ఆర్థిక స‌హాయం చేసి ఉదార‌భావాన్ని చాటుకున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వేదిక‌గా మ‌లుచుకున్నారు. ఇంట్లో అవ‌స‌రాల‌కు డ‌బ్బులు లేక‌పోవడం, ఇంటి అద్దె చెల్లించ‌లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో వారు ఆమెను స‌హాయం చేయాల్సిందిగా కోరారు. (అమెరికాపై కరోనా వైరస్‌ ప్రతాపం)

ఈ మేరకు లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి కోల్పోయిన వారు సోష‌ల్ మీడియా ద్వారా ఆమెను అభ్య‌ర్థించారు. దీంతో మ‌న‌సు చెలించిన గ్రాండే అభిమానుల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ల్లో 10 కార‌ణాల‌ను ఎంచుకొని డ్రా ఆధారంగా కొంత‌మందికి న‌గ‌దు పంపించారు. దాదాపు 500 వంద‌ల డాల‌ర్ల నుంచి 1500 డాల‌ర్ల వ‌ర‌కు అభిమానుల‌కు వెన్మో ద్వారా విరాళం అందించారు. ఆ డ‌బ్బులు త‌మ‌కు అందిన‌ట్లు అభిమానులు వెల్ల‌డించారు. అలాగే గ‌త కొన్ని రోజులుగా ఆమె ఇలా త‌మ‌కు డ‌బ్బులు పంపిస్తున్న‌ట్లు వారు తెలిపారు. ఇక ఈ విష‌యంపై అరియానా మాట్లాడుతూ.. క‌ష్టాల్లో ఉన్న వారికి త‌న వంతు స‌హాయం చేశాన‌ని, త‌న లాగే ఇత‌రులు కూడా వారిని ఆదుకోవాల‌ని ట్విట‌ర్ ద్వారా సూచించారు.

మరిన్ని వార్తలు