క్యాన్సర్‌ను జయించిన ప్రేమ

27 Jan, 2018 09:13 IST|Sakshi
అమెరికాకు చెందిన డస్టిన్ స్నైడర్, సీరా సివేరియో

వాషింగ్టన్ : ప్రాణాలు హరించే క్యాన్సర్ వ్యాధి వారి ప్రేమకు అడ్డుకాలేదు. ప్రమాదకర వ్యాధి భారిన పడి, ఎన్ని రోజులు జీవిస్తాడో తెలియని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. తనకు మాత్రం చివరి క్షణం వరకూ ప్రేయసితో మధుర క్షణాలు గడపాలనుకుంటున్నట్లు క్యాన్సర్ బాధితుడు చెప్పడం చూపరులను కంటతడి పెట్టించింది.

అమెరికాకు చెందిన డస్టిన్ స్నైడర్(19) , సీరా సివేరియో(19)లు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఈ క్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే జూన్ 2016లో పుట్టినరోజు నాడు తన కుమారుడికి ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలియగానే షాక్‌కు గురయ్యామని స్నైడర్ తల్లి కసాండ్రా ఫాండా కన్నీటి పర్యంతమయ్యారు. కాలేయ క్యాన్సర్ కు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయిందట. కుమారుడు స్నైడర్ కేవలం కొన్నిరోజులే బతుకుతాడని డాక్టర్లు ఆమెకు చెప్పారు. ఈ బాధాకర విషయాన్ని కుమారుడికి చెప్పగా.. తన మనసులో మాటను బయటపెట్టాడు. చిన్ననాటి స్నేహితురాలు సీరా సివేరియోను వివాహం చేసుకోవాలన్నది తన చివరి కోరికగా తల్లికి చెప్పాడు.

కొన్ని రోజుల కిందట తన మనసులో మాటను ప్రేయసి సివేరియోకు చెప్పాడు. ఆమెను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, అయితే తాను కేవలం కొద్దిరోజులు మాత్రమే బతుకుతానని వివరించాడు. కానీ బతికిన కొన్ని రోజులు నీతోనే సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నట్లు కళ్లల్లో నీటి సుడులు తిరుగుతుండగా చెప్పాడు. ఆమె స్నైడర్ తో ప్రేమపెళ్లికి ఒప్పుకుంది. గో ఫండ్ పేజ్‌ ద్వారా పెళ్లి ఏర్పాట్లకు కావలసిన విరాళాలు సేకరించారు. జనవరి 28న కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు.

ప్రేయసి సివేరియో మాట్లాడుతూ.. నా స్నేహితుడు స్నైడర్ చివరిక్షణం వరకూ సంతోషంగా ఉండేలా చేసుకుంటాను. అతడికి చివరిక్షణాలు అద్భుతక్షణాలుగా మారాలని మేం ప్రయత్నిస్తున్నాం. మా పెళ్లి బట్టల కోసం షాపింగ్ కూడా చేశాం. పెళ్లికి సిద్ధంగా ఉన్నానని వివరించింది.

మరిన్ని వార్తలు