అమెరికాకు విదేశీ పర్యాటకుల తగ్గుముఖం

1 Dec, 2017 02:44 IST|Sakshi

వాషింగ్టన్‌: వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా ఈ ఏడాది జూన్‌ వరకు అమెరికాకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార పనుల మీద వచ్చే వారి సంఖ్య దీని కన్నా మరింత పడిపోయిందని అమెరికా ట్రావెల్‌ అండ్‌ టూరిజం కార్యాలయం తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. అందులోని వివరాలు... గతేడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే అమెరికాలో పర్యటించిన వారి సంఖ్య నాలుగు శాతం పడిపోయింది. మెక్సికో పర్యాటకుల సంఖ్యలో 9 శాతం, బ్రిటన్‌ పర్యాటకుల సంఖ్యలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది.

వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య 9 శాతం పడిపోయింది. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల ఫలితంగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 30 శాతం పడిపోయింది. ఆఫ్రికా పర్యాటకుల సంఖ్య 27 శాతం తగ్గింది. ఉత్తర అమెరికా, కరీబియన్, తూర్పు ఐరోపాల నుంచి తగ్గిన పర్యాటకుల శాతం రెండంకెలకు చేరడం గమనార్హం. భారత్, వెనెజులా, అర్జెంటీనా, బ్రెజిల్‌ తదితర దేశాల పర్యాటకుల్లో 10 శాతానికి పైగా తగ్గిపోయారు. విచిత్రంగా అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా నుంచి పర్యాటకులు 18 శాతం పెరిగారు. 

మరిన్ని వార్తలు