అమెరికా వీణా-వాణీలు

16 Oct, 2016 02:30 IST|Sakshi
అమెరికా వీణా-వాణీలు

తెలుగు బాలికలు వీణా-వాణీలను వేరు చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యపడడం లేదు. కానీ సరిగ్గా వీరిలాగే తలలు కలసిపోయి ఉన్న అమెరికన్ కవలలకు మాత్రం అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా వారిని విడదీశారు. న్యూయార్క్‌కు చెందిన 13 నెలల ఈ కవలల పేర్లు జేడన్, అనియాస్. వీళ్లిద్దరినీ వేరు చేసేందుకు అక్కడి మాంటెఫెర్ పిల్లల ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన 27 గంటల ఆపరేషన్ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచింది. నికోల్, క్రిస్టినా దంపతులకు రెండో సంతానంగా తలలు అతుక్కుని కవలలు జన్మించారు. విడివిడిగా కాకుండా కపాలాలు రెండూ కలిసిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులు డాక్టర్ జేమ్స్ గుడ్ రిచ్‌ను సంప్రదించారు.

అప్పటికే కష్టతరమైన ఆపరేషన్లు ఎన్నో చేసిన అనుభవం ఉందాయనకు. అయితే జేడాన్, అనియాస్‌లది కష్టతరమైన కేసు. చిన్న తేడా వచ్చినా పిల్లలు మరణించే అవకాశం ఉంది. చివరికి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆపరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డాక్టర్ జేమ్స్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది వైద్యులు 27 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. మొదటి 16 గంటలు పిల్లల తలలను వేరుచేయడానికే పట్టింది. తర్వాత త్రీడీ టెక్నాలజీ సాయంతో కపాలాలను వేరు చేశారు. సర్జరీకి మరో 11 గంటలు పట్టింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన వెంటనే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు.

మరిన్ని వార్తలు