హిందుత్వాన్ని నమ్మిన అమెరికన్‌ 

14 Jan, 2019 01:56 IST|Sakshi

అన్నీ కలిసొస్తే ఆమె అగ్రదేశాధినేత అవుతారు.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలవుతారు. అమెరికా పీఠం అధిష్టించిన తొలి క్రైస్తవేతర, తొలి హిందూ మహిళగా మన దేశానికి గర్వకారణం అవుతారు. 
ఆమే.. తులసీ గబార్డ్‌. 

2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను ఢీకొనేందుకు డెమోక్రటిక్‌ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు 37 ఏళ్ల తులసి ప్రకటించడం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు మరికొందరు మహిళలూ ప్రకటించారు. అయితే వారితో పోలిస్తే తులసికి కొన్ని ప్లస్‌ పాయింట్లు ఉన్నాయి. పుట్టుకతో అమెరికన్‌ అయినా చిన్న వయసులోనే హిందూ మతం స్వీకరించి హిందుత్వాన్ని పాటిస్తున్నారు. ఇండియన్‌ అమెరికన్లలో ఆమెకు మంచి పేరు ఉంది. తులసి వరుసగా నాలుగోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి. హిందూ మహిళగానే చెప్పుకోవడానికి ఇష్టపడతారు. వరల్డ్‌ హిందూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నారు. 21 ఏళ్ల వయసులోనే హవాయి ప్రతినిధుల సభకు ఎన్నికయిన తులసి రెండేళ్లు దాంట్లో కొనసాగారు. 2012లో అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. అమెరికా సైన్యంలో పని చేశారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు, నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలపై తులసి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రజా సమస్యల పట్ల మెరుగైన అవగాహన ఉంది. ఈ అనుకూలాంశాలతో మిగతా వారికంటే రేసులో ఆమె ఒకడుగు ముందుంది. 

నేటివిటీ సమస్య 
తులసికి నేటివిటీ పెద్ద సమస్య కావచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తులసి అమెరికా పౌరురాలే. అయితే ఆమె అమెరికా గడ్డమీద పుట్టలేదు. దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రం లోని తుతులియా దీవిలో 1981లో పుట్టారు.  తర్వాత ఆమె కుటుంబం హవాయికి వచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ చట్టం(ఐఎన్‌ఏ)ప్రకారం తుతులియా వంటి ప్రాంతాల్లో పుట్టినవారు అమెరికా జాతీయులే కాని పుట్టుక తో అమెరికన్లుగా పరిగణించబడరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ‘నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌’అయి ఉండాలి. అయితే, నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌ అంటే ఎవరో రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించలేదు. సాధారణంగా పుట్టుకతో అమెరికా పౌరుడయిన వారిని నేచురల్‌ బోర్న్‌ సిటిజన్‌గా పరిగణిస్తుంటారు. తులసి తల్లిదండ్రులిద్దరూ అమెరికా పౌరులే. కాబట్టి చట్ట ప్రకారం తులసి అమెరికా పౌరురాలే అవుతుంది. అయితే అమెరికా బయట పుట్టినవారెవరూ ఇంతవరకు అధ్యక్ష పదవికి ఎన్నికవలేదు.   

మరిన్ని వార్తలు